NTV Telugu Site icon

Duddilla Sridhar Babu : దేశంలో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్‌ అసిస్టెంట్లుగా నియమించాం

Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu

 

Duddilla Sridhar Babu : రాష్ట్రంలో శాంతి భద్రతలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, పోలీసు విభాగాన్ని మరింత సమర్థంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సైబర్ నేరాల అదుపు కోసం ఇప్పటికే పోలీసు శాఖకు తగిన శిక్షణను అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సైబర్ నేరగాళ్లను పసిగట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి బాధితులకు సుమారు రూ. 183 కోట్లను తిరిగి ఇప్పించామని తెలిపారు.

సైబర్ నేరాలను నియంత్రించేందుకు పోలీసు శాఖ ఆధునీకరణ చేపట్టిందని, ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. నేటి డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల ఉత్పత్తి, వినియోగం పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. ఇప్పటికే నార్కోటిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి నలుగు ప్రత్యేక నార్కోటిక్ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు.

మాదకద్రవ్యాల వ్యసనంతో బాధపడుతున్న వారికి సహాయం చేయడానికి రీజనల్ కౌన్సిలింగ్ కేంద్రాలను ప్రజలకు అందుబాటులో ఉంచామని, యువత మాదకద్రవ్యాలకు బానిస కాకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ఇప్పటికే ట్రాఫిక్ విభాగంలో మరిన్ని సిబ్బందిని నియమించేందుకు ప్రణాళికలు రూపొందించామని, అవసరమైన చోట కొత్త ఫ్లైఓవర్లు, పాదచారుల వంతెనలు నిర్మించనున్నట్లు తెలిపారు. “నగరంలో రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ సిగ్నల్ మేనేజ్‌మెంట్ మెరుగుపరిచేందుకు ప్రత్యేక నిధులను కేటాయించాం. అవసరమైన మార్గాల్లో స్మార్ట్ ట్రాఫిక్ మానిటరింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నాం,” అని మంత్రి పేర్కొన్నారు.

అన్ని రాజకీయ పార్టీలకు చెందిన సభ్యులు శాసనసభ సమావేశాలను పొడిగించాలని కోరారని, వచ్చే సమావేశాల్లో ఎక్కువ పని గంటలు ఉంటాయన్న నమ్మకాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై సభ్యులు మరింత సమయం వెచ్చించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక భవనాన్ని ఢిల్లీలో నిర్మించేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని, ఆ భవన నిర్మాణ పనులను ప్రత్యేక సంస్థకు అప్పగించామని మంత్రి తెలిపారు. త్వరలోనే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామని, అధికారుల సమన్వయంతో ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.

ప్రస్తుతం శాసనసభ, శాసనమండలి భవనాలు దూరంగా ఉండటం వల్ల కొన్నిసార్లు పరిపాలనలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, త్వరలోనే రెండింటినీ సమీపంలోని కొత్త భవనంలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ మార్పుతో పరిపాలనా వ్యవస్థ మరింత సమర్థవంతంగా పని చేస్తుందని పేర్కొన్నారు. శాంతి భద్రతల విషయంలో తెలంగాణ పోలీసు శాఖ దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి అన్నారు. గతంలోనే ఉత్తమ పోలీసు విభాగంగా తెలంగాణకు అనేక అవార్డులు వచ్చాయని, ఇతర రాష్ట్రాలు కూడా ఇక్కడి పోలీసు విధానాలను అనుసరిస్తున్నాయని చెప్పారు.

“ప్రభుత్వం పోలీసు సిబ్బందికి అన్ని రకాలుగా మద్దతు ఇస్తుంది. వారి కుటుంబాల కోసం, ముఖ్యంగా పిల్లల చదువుల కోసం, పోలీస్ యంగ్ ఇండియా స్కూల్‌ను మంచిరేవుల వద్ద ప్రారంభించాం. ఏప్రిల్ నుంచి తరగతులు ప్రారంభిస్తాం,” అని మంత్రి తెలిపారు.

CM Revanth Reddy : విద్యా కమిషన్ ఏర్పాటు.. పర్యవేక్షణకు కొత్త వ్యవస్థ