Medaram Jatara: అడవి తల్లీ బిడ్డల ఆత్మగౌరవ ప్రతీక, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర నేడు (బుధవారం) అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. నేటి నుంచి జనవరి 31 వరకు నాలుగు రోజుల పాటు ఈ జాతర కొనసాగనుంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి పొరుగు రాష్ట్రాల నుంచి సుమారు 3 కోట్ల మంది భక్తులు తరలివస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
Without Ticket Flight Journey: మనవడికి టికెట్ తీసుకోకుండా ఫ్లైట్ ఎక్కించిన బామ్మ.. చివరికి.?
నేటి ప్రత్యేకత:
జాతర తొలిరోజైన బుధవారం సాయంత్రం 6 గంటలకు మేడారం పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కోలాహలం మొదలవుతుంది. కన్నెపల్లి నుంచి పూజారులు సారలమ్మను గద్దెపైకి తీసుకువస్తారు. అదే సమయంలో కొండాయి నుంచి గోవిందరాజును, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజును మేడారంలోని గద్దెలపైకి తీసుకువచ్చి ప్రతిష్ఠించడంతో జాతర అంకురార్పణ జరుగుతుంది. రేపు (గురువారం) సాయంత్రం చిలకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకోవడంతో జాతర తార స్థాయికి చేరుకుంటుంది.
జాతర అధికారికంగా నేడు ప్రారంభమైనప్పటికీ.. గత వారం రోజులుగానే మేడారం జనసంద్రమైంది. జంపన్న వాగు వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రస్తుతం మేడారం పరిసర ప్రాంతాల్లో ఇసుక వేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు. భారీగా వాహనాలు తరలివస్తుండటంతో బుధవారం వేకువజామునే సుమారు 4 కి.మీ. మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీనితో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Road Accident: అతివేగం.. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి..!
అతిపెద్ద ఆదివాసీ జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మొత్తం 21 శాఖల నుంచి 42,027 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. ఇంకా భక్తుల సౌకర్యార్థం టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) 4,000 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇక వాహనాల కోసం 1,418 ఎకరాల్లో 42 పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేశారు. జాతర ప్రాంతాన్ని 8 అడ్మినిస్ట్రేటివ్ జోన్లుగా, 42 సెక్టార్లుగా విభజించి అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
జనవరి 30, 31 తేదీల్లో భక్తులు భారీ ఎత్తున నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. జనవరి 31వ తేదీ సాయంత్రం 6 గంటలకు దేవతలందరూ తిరిగి వన ప్రవేశం చేయడంతో ఈ మహా జాతర ముగుస్తుంది.
