NTV Telugu Site icon

CM KCR: పోడు పట్టాలకు వేళాయే.. నేటి నుంచి అర్హులకు పట్టాలివ్వనున్న సర్కార్

Cm Kcr Patta Books

Cm Kcr Patta Books

తెలంగాణ రాష్ట్రంలో పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన, ఆదివాసీ రైతుల కల సాకారం కానుంది. వీరికి పట్టా పుస్తకాలు పంపిణీ చేసేందుకు గిరిజన సంక్షేమ, అటవీ శాఖలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఇవాళ ఆసిఫాబాద్‌ జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అర్హులకు పట్టాలను అందజేయనున్నారు. మిగతా జిల్లాల్లో జిల్లా మంత్రుల చేతుల మీదుగా అర్హులకు పట్టా పుస్తకాలను పంపిణీ చేయనున్నారు.

Read Also: Vladimir Putin: ప్రధాని మోడీని అభినందించిన పుతిన్‌.. ఎందుకో తెలుసా?

పోడు భూముల్లో సాగుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. 1,50,012 మంది రైతులు 4,05,601 ఎకరాల్లో సాగు చేసుకుంటున్నట్లు గిరిజన సంక్షేమ, అటవీశాఖ అధికారులు గుర్తించారు. వీరంతా గిరిజనులు, ఆదివాసీలే. కాగా అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 50,595 మంది రైతులు 1,51,195 ఎకరాల్లో భూమిని సాగు చేస్తున్నాట్లు గుర్తించారు. మహబూబాబాద్‌ జిల్లాలో 24,972 మంది రైతులు, ఆసిఫాబాద్‌ జిల్లాలో 15,254 మంది రైతులు పట్టాల కోసం దరఖాస్తులు సమర్పించుకున్నారు.

Read Also: WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్‌.. ఒకేసారి 32 మందికి వీడియో కాల్‌ చేయొచ్చు

ఇక పట్టాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి ఇవాళ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నూతనంగా ప్రారంభించిన కలెక్టరేట్ లోనే ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నియోజకవర్గాలకు చెందిన 12 మంది గిరిజన రైతులకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా భూమి హక్కుపత్రాలను అందజేయనున్నారు. అయితే నేటి నుంచి అన్ని జిల్లాలో ఉన్న గిరిజన, ఆదివాసీ రైతులకు పట్టా పుస్తకాలను ఇవ్వనున్నారు.

Read Also: CM KCR: నేడు కొమురంభీం జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

ఇవాళ సీఎం కేసీఆర్ ఉదయం 10.50 గంటలకు ప్రగతిభవన్‌ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, అక్కడినుంచి హెలికాప్టర్‌లో ఆసిఫాబాద్‌కు బయలుదేరతారు. పట్టణంలో తొలుత కుమురంభీం విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. సమీపంలోని పిల్లల పార్కులో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి కోట్నాక భీంరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని, చివరగా కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోడు రైతులకు పట్టా పుస్తకాలు ముఖ్యమంత్రి అందజేస్తారు. సాయంత్రం 6.25 గంటలకు ప్రగతిభవన్‌ చేరుకోనున్నారు.