Site icon NTV Telugu

Telangana Govt: ర‌హ‌దారులు.. భ‌వ‌నాల‌ నిర్మాణంలో ప్రజా ప్రభుత్వం దూకుడు….

Telangana Govt

Telangana Govt

“మన రోడ్లను నిర్మించింది మన సంపద కాదు… మన సంపదను నిర్మించింది మన రోడ్లు” అని అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడి అన్నారు. ఒక దేశాభివృద్ధిలో ర‌హ‌దారుల ఎంత కీల‌క‌మో ఆయ‌న వ్యాఖ్యలు చెప్పక‌నే చెబుతున్నాయి. తెలంగాణ ఏడాది క్రితం కొలువుదీరిన ప్రజా ప్రభుత్వం రహదారుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. మండలాల నుంచి జిల్లాల‌ను కలిపే రహదారులు, జిల్లాల నుంచి రాష్ట్ర రాజధానిని కలిపే రాష్ట్ర రహదారులు, వివిధ జిల్లాల మీదుగా ప్రయాణించే జాతీయ రహదారుల నిర్మాణంలో జోరు క‌నిపిస్తోంది. ఏడాది కాలంలో రాష్ట్రంలో ఆర్ అండ్ బీ ప్రగ‌తిని చూద్దాం..

బ‌డ్జెట్‌లో రహదారులు, భవనాల శాఖకు ప్రాధాన్యం..
ఈ ఏడాది రాష్ట్ర (2024-25) బ‌డ్జెట్‌లో రహదారులు, భవనాల శాఖకు (ఆర్ అండ్ బీ) రూ.7,490కోట్లు కేటాయించారు. ఇందులో ఆర్&బీకి రూ.5,790 కోట్లు, ఓఆర్ఆర్ కు రూ.200 కోట్లు, రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్‌)కు రూ.1500 కోట్ల‌ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇది గ‌తేడాది బ‌డ్జెట్ క‌న్నా రూ.4,990 కోట్లు ఎక్కువ‌. ఈ ఏడాదిలో వ‌చ్చిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారుల మరమ్మతుల‌కు పంచాయ‌తీరాజ్, ఆర్ &బీ శాఖ‌లు వెంట‌నే మ‌ర‌మ్మతులు చేప‌ట్టాయి. ఆ ప‌నుల‌ అమలుకు ఒక నోడల్ ఏజెన్సీని నియమించడం రాష్ట్ర ప్రభుత్వం రహదారి భద్రతకు ఇస్తున్న ప్రాధాన్యతకు మచ్చు తునక. తెలంగాణ‌ను దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌తో అనుసంధానం చేసేవి జాతీయ ర‌హ‌దారులు.. గ‌త ప‌దేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం స‌మాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వంతో త‌మ‌కేం సంబంధం లేద‌న్నట్లుగా వ్యవ‌హ‌రించి నిధులు రాబట్టడంలో విఫ‌ల‌మైంది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన త‌ర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ప‌లుమార్లు జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్కరీని క‌లిశారు. కేంద్రం నుంచి తెలంగాణ‌కు రావ‌ల్సిన నిధుల మంజూరుకు గ‌ట్టి ప్రయ‌త్నం చేశారు. ఫ‌లితంగా హైదరాబాద్-విజయవాడ (ఎన్.హెచ్-65) రహదారిపై 17 చోట్ల బ్లాక్ స్పాట్లను గుర్తించి రిపేర్ చేసేందుకు రూ.422.12 కోట్లను మంజూరు చేయించ‌గ‌లిగాం.

రీజినల్ రింగ్ రోడ్డు..
ఎన్.హెచ్.- 353C రహదారిలో సిరొంచ-ఆత్మకూర్ భాగానికి రూ. 662.67 కోట్లు, నల్గొండ పట్టణానికి వెలుపల నుంచి ఎన్.హెచ్.- 565 పై నకిరేకల్ – నాగార్జునసాగర్ వరకు నిర్మిస్తున్న 14.0 కి.మీ 4 వరుసల బైపాస్ నిర్మాణానికి రూ. 516.17 కోట్లతో పాటు 11 నెలల కాలంలో 272 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.2,086 కోట్లను కేంద్రం నుంచి మంజూరు చేయించ‌డంలో రాష్ట్ర ప్రభుత్వం స‌ఫ‌ల‌మైంది. రాష్ట్ర ప్రగతికి కీలకమైన రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) ఉత్తర భాగం నిర్మాణానికి సంబంధించిన యుటిలిటీ ఛార్జీలు చెల్లించమని గత ప్రభుత్వం మొండికేయడంతో ప్రాజెక్టు ఆగిపోయే ప‌రిస్థితి నెల‌కొంది. ఈ విష‌యంలో గత ప్రభుత్వ‌ అశాస్త్రీయ విధానాలను పునఃసమీక్షించి.. యుటిలిటీ ఛార్జీలు చెల్లిస్తామని ప్రజా ప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి విన్నవించింది. దీంతో ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం ప‌నులు తిరిగి పట్టాలెక్కాయి. ఈ ప్రాజెక్టు పనులకు గుదిబండలా మారిన అటవీ అనుమతులను ప్రజా ప్రభుత్వం సాధించింది. 95 శాతం భూసేకరణ పూర్తి చేసి ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం నిర్మించేందుకు బృహత్తర ప్రణాళికలు రూపొందించడంతో పాటు డీపీఆర్ రూపొందించేందుకు కన్సల్టెన్సీ ఎంపికకు టెండర్లు పిలవడం పూర్తయింది. ఈ రెండు భాగాలు పూర్తయి అందుబాటులోకి వస్తే తెలంగాణ‌ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారడమే కాకుండా ప్ర‌జల జీవన ప్రమాణాలు అగ్రస్థానంలో నిలబడుతాయ‌న‌డంలో సందేహం లేదు.

రూ. 850 కోట్ల విలువైన 435.29 కి.మీ పొడవైన 31 పనులను..
సీఆర్ఐఎఫ్ (సెంట్రల్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) పథకం కింద రూ. 850 కోట్ల విలువైన 435.29 కి.మీ పొడవైన 31 పనులను కేంద్ర నుంచి మంజూరు చేయించ‌డంలో రాష్ట్ర ప్రభుత్వం స‌ఫ‌ల‌మైంది. ప్రస్తుతం ఆ పనులు పురోగతిలో ఉన్నాయి. ఇందులో 183.92 కి.మీ పొడవైన 15 పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. సీఆర్ఐఎఫ్ కింద గ‌తంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రూ. 850 కోట్ల మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం విజ‌య‌వంత‌మైంది. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన త‌ర్వాత ర‌హ‌దారుల నిర్మాణానికి ప్రణాళిక, ప్రణాళికేతర నిధుల కింద రూ.3,725.22 కోట్లు మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ నిధుల‌తో కొత్తగా 769.35 కి.మీ. పొడవు కలిగిన రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం అనుమ‌తులు ఇచ్చింది. వాటిలో 55 కిలోమీటర్ల పొడవు కలిగిన రహదారుల‌, 9 వంతెనల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. వీటితో పాటు వివిధ రోడ్లు, వంతెనల‌ పనులకు రూ. 433 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేసింది.

హెరిటేజ్ భవనాల మ‌ర‌మ్మతు..
వివిధ హెరిటేజ్ భవనాల మ‌ర‌మ్మతు, నూతన భవనాలను నిర్మించి ప్రజ‌ల‌కు అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్ అండ్ బీ ప్రయ‌త్నిస్తోంది. ఇందులో భాగంగా శాస‌న‌స‌భ ప్రాంగణంలోని చారిత్రక‌ మహబూబియా హాల్ ను మండలిగా మార్చేందుకు రూ. 49 కోట్లతో పున‌రుద్ధర‌ణ ప‌నులు ఆగాఖాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాగుతున్నాయి. ఈ భవనం వచ్చే మార్చి నాటికి అందుబాటులోకి రానుంది. రాజ్ భవన్ ప్రాంగణంలోని మరో హెరిటేజ్ కట్టడం షామంజిల్ పునరుద్ధరణ ప‌నులు రూ.7.62 కోట్లతో కొన‌సాగుతున్నాయి. ప్రజలకు న్యాయం అందించడం అంటే.. మానవ విలువల సంరక్షణగా భావించాలని పెద్దలు చెబుతుంటారు. ఈ భావనను ప్రజలకు సవ్యంగా అందించాలంటే న్యాయాలయాలకు పటిష్టమైన మౌలిక వసతులు ఉండాలి. అందుకే జిల్లా కేంద్రాల్లో కోర్టు భవనాల నిర్మాణానికి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా 12 జిల్లా కేంద్రాల్లో జిల్లా కోర్టు కాంప్లెక్సుల నిర్మాణానికి రూ.1,053 కోట్లు కేటాయించి రూ.972 కోట్ల ప‌నుల‌కు పరిపాలనపరమైన అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఖమ్మం జిల్లా మధిరలో కోర్టు భవన నిర్మాణానికి రూ.24.50 కోట్లతో టెండర్లు పిలిచారు.

యువత కోసం స్కిల్ యూనివర్సిటీ..
యువతను ప్రతిభావంతులను చేసి ప్రపంచంతో పోటీపడే శక్తిమంతులుగా, విజ్ఞానవంతులుగా నిలబెట్టేందుకు ప్రజాప్రభుత్వం అలుపెరగక కృషి చేస్తోంది. ఇందులో భాగంగా నల్గొండ‌, కోదాడ నియోజకవర్గాల్లో రూ.20 కోట్లతో స్కిల్ యూనివర్సిటీ ప‌రిధిలో భ‌వ‌నాలు నిర్మిస్తోంది. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన కొడంగల్, మంథని, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా రూ.27.30 కోట్లతో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజుల నిర్మాణం ప్రారంభ‌మైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో డివిజన్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 26 కోట్లు కేటాయించింది. సూర్యాపేట జిల్లాలో, కొడంగల్ నియోజకవర్గంలో వివిధ మౌలిక వసతుల కల్పనకు రూ.231 కోట్లు మంజూరు చేయ‌డం జ‌రిగింది. అలాగే రాష్ట్రంలో వివిధ భవనాల మరమ్మతుల కోసం మరో రూ.20.18 కోట్ల కేటాయింపు పూర్తయింది.

విమానాశ్రయాల సాధ‌న‌కు కృషి…
విమానాశ్రయాల సాధ‌న‌కు రాష్ట్ర ప్రభుత్వం క‌ట్టుబ‌డి ఉంది. వ‌రంగల్ జిల్లా మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కావల్సిన 253 ఎకరాల భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లు మంజూరు చేసింది. పాల్వంచ‌, అంత‌ర్గాం, ఆదిలాబాద్ లోనూ విమానాశ్ర‌యాల నిర్మాణానికి అవ‌స‌ర‌మైన అద‌న‌పు భూ సేక‌ర‌ణ ప‌నులు సాగుతున్నాయి. ఆర్ అండ్‌ బీలో రిక్రూట్‌మెంట్ల కంటే రిటైర్మెంట్లే ఎక్కువ అనే నానుడు డిపార్ట్ మెంట్ సర్కిళ్లలో గ‌తంలో వినిపించేది. అందుకు భిన్నంగా ప్రజాప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే 156 ఏఈఈ పోస్టులకు పరీక్షలు నిర్వహించి నియామ‌కాలు పూర్తి చేసింది. కొత్తగా నియ‌మితులైన ఏఈఈలు తమకు కేటాయించిన స్థానాల్లో పనులు చేస్తూ మౌలిక సదుపాయాల కల్పనలో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. ఇవి కేవ‌లం నియామకాలు మాత్రమే కాదు శాఖ‌లో నూతన జవసత్వాలు నింపే సరికొత్త ఆరంభం. నియామ‌కాల ప్రక్రియ ఇలాగే కొనసాగుతుందని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు వాక‌లో పనిచేసే ఉద్యోగుల్లో ఎక్కడలేని సంతోషాన్ని నింపాయి. సర్వీసు రూల్స్ లేక ప‌దోన్నతులు, బ‌దిలీలు లేక ప‌దేళ్లుగా శాఖ ప‌రిధిలోని ఉద్యోగులు ఎదుర్కొన్న ఇబ్బందులు వ‌ర్ణనాతీతం. గత ప్రభుత్వంలో నచ్చినోళ్లకు ప్రమోషన్, నచ్చకపోతే ట్రాన్స్ ఫర్ అనే సర్వీస్ రూల్ ఒక్కటే అమల్లో ఉండటంతో ఉద్యోగుల ప్రమోషన్ల సంగతి మరిచిపోయి నిర్వేదంలో పనిచేసేవారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వీసు రూల్స్ అమలు చేయ‌డంతో ఏఈఈ మొద‌లు ఎస్ఈల వరకు ప్రమోషన్లకు మార్గం సుగమ‌మైంది.

Exit mobile version