Site icon NTV Telugu

Gold Seized: తెలంగాణ ‘గోల్డ్ మ్యాన్’ బంగారం సీజ్.. అదుపులోకి తీసుకున్న ఐటీ అధికారులు..

Bangaru Babu Gold Seized D Copy

Bangaru Babu Gold Seized D Copy

తెలంగాణలో ‘బంగారు బాబు’గా గుర్తింపు పొందిన హోప్ ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు కొండ విజయ్ కుమార్ ఆదాయపు పన్ను (IT) అధికారుల విచారణను ఎదుర్కోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏం జరిగిందంటే.. న్యూఢిల్లీలో జరుగుతున్న హాకీ ఇండియా అవార్డుల ప్రధానోత్సవానికి హాజరయ్యేందుకు కొండ విజయ్ కుమార్ గురువారం హైదరాబాద్‌ నుంచి బయలుదేరారు. అయితే.. ఆయన ప్రయాణానికి ముందే హైదరాబాద్‌లోని ఐటీ అధికారులు ఆయన పాన్ కార్డు వివరాలను సేకరించినట్లు సమాచారం. ఆయన ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన వెంటనే.. అక్కడ వేచి ఉన్న నలుగురు ఐటీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

12 గంటల సుదీర్ఘ విచారణ..

విజయ్ కుమార్ తన ఒంటిపై భారీగా బంగారు ఆభరణాలు ధరించి ఉండటమే ఈ తనిఖీలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. సుమారు 12 గంటల పాటు ఆయనను విమానాశ్రయంలోనే ప్రత్యేకంగా విచారించారు. ఈ సందర్భంగా అధికారులు ఆయన ధరించిన సుమారు కొన్ని కిలోల బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకుని, వాటికి సంబంధించిన కొనుగోలు రశీదులు, ఆదాయ వనరులపై ప్రశ్నలు సంధించారు. ఆయన పేరిట ఉన్న స్థిర, చర ఆస్తుల వివరాలను, హోప్ ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న లావాదేవీలను అధికారులు ఆరా తీశారు. సుదీర్ఘ విచారణ అనంతరం.. హాకీ ఇండియా అవార్డుల కార్యక్రమానికి వెళ్లడానికి ఆయనకు అనుమతినిచ్చారు. అయితే.. త్వరలోనే పూర్తిస్థాయి ఆధారాలతో మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.

Also Read:FBI Chief Email Breached: అమెరికాకు బిగ్ షాక్.. FBI చీఫ్ ఈమెయిల్ హ్యాక్ చేసిన ఇరాన్..

ఎవరీ కొండ విజయ్ కుమార్..?

హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లికి చెందిన విజయ్ కుమార్.. తన ఒంటిపై దాదాపు 5 నుంచి 12 కిలోల వరకు బంగారం ధరిస్తూ సోషల్ మీడియాలో ‘గోల్డ్ మ్యాన్’గా ఫేమస్ అయ్యారు. ఆయన హోప్ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఐటీ శాఖ ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అధికారుల తనిఖీల్లో తేలే అంశాలను బట్టి ఈ కేసు మున్ముందు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది.

Exit mobile version