NTV Telugu Site icon

INDW vs SLW: తృటిలో త్రిష హాఫ్ సెంచరీ మిస్.. 12 పరుగులకే 5 వికెట్స్!

Gongadi Trisha

Gongadi Trisha

మలేసియా వేదికగా జరుగుతున్న అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌ 2025లో భారత అమ్మాయిలు దూసుకుపోతున్నారు. గ్రూప్‌-ఎలో ఉన్న భారత్.. వెస్టిండీస్‌, మలేసియా జట్లపై విజయం సాధించింది. నేడు కౌలాలంపూర్‌ వేదికగా శ్రీలంకతో తలపడవుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టాన్ని 118 పరుగులు చేసింది. తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకుంది. 44 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సుతో 49 రన్స్ చేసి అవుట్ అయింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ మనుడి నానయక్కర బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళా జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కమలిని (5) నిరాశపర్చింది. సానికా చాల్కే డకౌట్ కాగా.. నికి ప్రసాద్‌ (11), భావికా అహిరే (7), ఆయుషి శుక్లా (5) తక్కువ స్కోరుకే అవుట్ అయ్యారు. ఈ సమయంలో త్రిష ఒంటరి పోరాటం చేసింది. మిథిలా వినోద్‌ (16), జోషిత (14), పరుణిక (1), షబ్నామ్‌ (2), వైష్ణవీ శర్మ (1) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో లిమాంస తిలకరత్న, ప్రముది, అసెని తలో 2 వికెట్లు పడగొట్టారు.

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు వరుస షాకులు తగులుతున్నాయి. 4.2 ఓవర్లలో 5 వికెట్స్ కోల్పోయింది. షబ్నం ఎండీ షకీల్, జోషిత వీజీలు తలో రెండు వికెట్స్ పడగొట్టారు. సంజన కవింది (5), సుముడు నిసంసాల (0), దహమి సనేత్మా (2), హిరుణి హన్సిక (2) అవుట్ అయ్యారు. కెప్టెన్ మనుడి నానయక్కర రనౌత్ అయింది. ప్రస్తుతం క్రీజులో రష్మిక సెవ్వండి, లిమాన్స తిలకరత్నలు ఉన్నారు. లంక విజయానికి 89 బంతుల్లో 101 రన్స్ అవసరం. భారత్ హ్యాట్రిక్ విజయం ఖాయంగా కనిపిస్తోంది.