NTV Telugu Site icon

Theaters Closed: రోజుకు 4 వేలు కూడా రావడం లేదు: విజయేందర్ రెడ్డి

Theatres

Theatres

తెలంగాణలో రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో షోలు ఆపేస్తున్నామని యాజమాన్యాలు స్వచ్ఛందంగా ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటం, నష్టం ఎక్కువ రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని థియేటర్ నిర్వాహకులు తెలిపారు. ప్రదర్శనల నిలిపివేతపై తాజాగా తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి స్పందించాడు. రోజుకు 4 వేలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ… ‘చిన్న పట్టణాల్లో సగటు సింగిల్ స్క్రీన్ థియేటర్ నిర్వహణ ఖర్చు రూ.10,000 నుంచి రూ.12,000 వరకు ఉంటుంది. అదే హైదరాబాద్‌లో రూ.15,000 నుంచి రూ.18,000 వరకు ఉంటుంది. చాలా థియేటర్లలో రోజుకు రూ. 4,000 కూడా రావడం లేదు. చిన్న సినిమాల వసూళ్లు మరింత పడిపోతున్నాయి. ఈ పరిస్థితిలో సమీప భవిష్యత్తులో చెప్పుకోదగ్గ సినిమాల విడుదల లేకపోవడంతో.. మేము థియేటర్లను తాత్కాలికంగా మూసివేలని నిర్ణయించుకున్నాం’ అని అన్నారు.

Also Read: Air India-Bomb: టిష్యూ పేపర్‌పై నోట్.. ఎయిరిండియా విమానంలో బాంబ్‌ కలకలం!

‘వసూళ్లు వచ్చేసరికి రూ.4-6 వేలు కూడా రావడం లేదు. సరైన సినిమాలు లేక ప్రేక్షకులు థియేటర్‌కి రావడం లేదు. సింగిల్‌ స్క్రీన్‌లే కాదు.. మల్టీప్లెక్స్‌ల్లోనూ ప్రదర్శనలు తగ్గిపోయాయి. తెలంగాణలో దాదాపుగా సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో ప్రదర్శనలు నిలిచిపోయాయి. ఒకవేళ ఏ నిర్మాత అయినా మేం ఖర్చులు భరిస్తామని అడిగితే.. మేం ప్రదర్శనలు కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని విజయేందర్ రెడ్డి తెలిపారు. పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో పాటు.. ఐపీఎల్‌ 2024, ఎన్నికల హడావుడి థియేటర్‌లపై పెను ప్రభావం చూపాయి.