Telangana employee trekked up Mount Kilimanjaro
ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని సమాచార శాఖ ఉద్యోగి నితిన్ అధిరోహించారు. స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా కిలిమంజారో పై 75 అడుగుల పతాకాన్ని నితిన్ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే నాలుగవ అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ ఉద్యోగి యేముల నితిన్ విజయవంతంగా అధిరోహించి భారత స్వాతంత్ర వజ్రోత్సవాల గుర్తుగా 75 అడుగుల భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. హైదరాబాద్ లోని సమాచార శాఖ కార్య నిర్వాహక ఇంజనీరు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న యువకుడైన నితిన్ ఆగస్టు 14 వతేదీన ఉదయం 7 .15 గంటలకు 5895 మీటర్ల ఎత్తైన (19341 అడుగులు ) కీలుమంజారో పర్వతాన్ని సునాయాసంగా అధిరోహించాడు.
ఉధృతమైన గాలులు, అతి తక్కువ ఉష్టోగ్రత తో నిటారుగా ఉండే కిలిమంజారో పర్వతం ప్రమాదకరంగా ఉంటుంది. ఎంతోశిక్షణ పొందిన పర్వతారోహకులు మాత్రమే ఈ పర్వతాన్ని అధిరోహించగలుగుతారు. అటువంటి ప్రమాదకరమైన కిలిమంజారో పర్వతాన్ని అత్యంత సునాయాసంగా అధిరోహించడంతో పాటు భారత జాతీయ స్ఫూర్తిని చాటేలా వజ్రోత్సవ వేళ 75 అడుగుల జండాను పర్వత శిఖరాగ్రంపై ఎగురవేసి మొత్తం భారత జాతి కీర్తి ప్రతిష్టలను పెంపొందించాడు.
