Neelam Madhu Mudiraj to Contest independent candidate form Patancheru constituency: అసెంబ్లీ ఎలెక్షన్స్ 2023కి ముందు అధికారిక బీఆర్‌ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు రాజీనామా చేయగా.. తాజాగా నీలం మధు ముదిరాజ్ రాజీనామా చేశారు. చివరి క్షణం వరకు పటాన్‌చెరు నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ పార్టీ టికెట్ ఆశించిన ఆయనకు నిరాశే ఎదురైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి నిన్న సీఎం కేసీఆర్ బీఫామ్ ఇవ్వడంతో నీలం మధు ఈ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి తాను రాజీనామా చేశానని, వచ్చే ఎన్నికల్లో ప్రజల మనిషిగా (ఇండిపెండెంట్) పోటీ చేస్తా అని ఆయన తెలిపారు.
పటాన్‌చెరు నియోజకవర్గం కొత్తపల్లిలో నేడు నీలం మధు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా కొత్తపల్లి గ్రామం నుంచి తాను పాదయాత్ర చేస్తున్నట్లు, అసెంబ్లీ ఎన్నికల బరిలో తాను ఉంటున్నట్లు స్పష్టం చేశారు. ‘పటాన్‌చెరులో అహంకారం కావాలా? లేదా ఆత్మగౌరవం కావాలో? ప్రజలు తేల్చుకోవాలి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతున్నా.. మీ బిడ్డనై వస్తున్నా. బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా. వచ్చే ఎన్నికల్లో ప్రజల మనిషిగా పోటీ చేస్తున్నా’ అని నీలం మధు తెలిపారు.
Also Read: Telangana Elections 2023: తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుంది.. త్వరలోనే మేనిఫెస్టో: కాసాని
‘మీ బీసీ బిడ్డను ఆశీర్వదించండి. ప్రజలే మా గుర్తు.. బ్యాలెట్ పేపర్‌లో నా బొమ్మ చూసి ఓటు వేయండి. ఎమ్మెల్యేగా గెలిస్తే గుడ్ మార్కింగ్ పటాన్‌చెరు పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తా. పటాన్‌చెరు నియోజకవర్గం ఏ ఒక్క కులందో కాదు. దోచుకొని దాచుకోవడం మహిపాల్ రెడ్డి తత్వం. కుటుంబ పాలనకు ఇక చరమ గీతం పాడాలి. అందరి బాగోగులు నాకు ముఖ్యం. నవంబర్ 30న బ్యాలెట్ పేపర్ పైన బొమ్మ చూసి ఓటు వేయండి. క్రషర్ మిషన్‌లో రాళ్లు కొడితే బంగారం వస్తుందా?. మీ అక్రమాల చిట్టా అంతా నా దగ్గర ఉంది ఎమ్మెల్యే. పేద కుటుంబం నుంచి వచ్చి అంచలంచెలుగా ఎదిగిన నన్ను, నా కార్యకర్తలను తొక్కేయేలాని చూస్తున్నారు. ఏ భయం లేకుండా ఈ బీసీ బిడ్డను పటాన్‌చెరులో గెలిపించుకోండి. రాష్ట్రం మొత్తం పటాన్‌చెరు వైపు చూస్తోంది.. నిర్ణయం ప్రజలదే’ అని నీలం మధు అన్నారు.