Janga Ragava Reddy Likely to contest as an independent candidate from Warangal: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ నుంచి రెండో జాబితా విడుదల అనంతరం ఆ పార్టీ నుంచి అసమ్మతి వాదం మెల్లగా బయటికి వస్తోంది. ఇప్పటికే చాలాచోట్ల కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. తనకు మునుగోడు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన చలమల కృష్ణారెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగాలని చూస్తున్నారట. అదే బాటలో జంగా రాఘవరెడ్డి కూడా నడవనున్నారని తెలుస్తోంది.
జంగా రాఘవరెడ్డి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ ఆశించారు. తనకు టికెట్ వస్తుందని ఎంతో నమ్మకంతో ఉన్న జంగాకు కాంగ్రెస్ అధిష్టానం హ్యాండ్ ఇచ్చింది. చివరకు జంగాను కాదని నాయిని రాజేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. టికెట్ రాకపోవడంతో జంగా కంటతడి పెట్టారు. ముఖ్య నాయకులతో అత్యవసర సమావేశమైన ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. బీఆర్‌ఎస్ వైపు వెళ్లాలా? అనే ఆలోచనలో జంగా ఉన్నాడట. మరోవైపు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగాలని కూడా చూస్తున్నారట. భవిష్యత్త్ కార్యచరణపై అత్యవసర మీటింగ్ పెట్టిన జంగా.. ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Also Read: KTR Press Meet: అలా చేసి ఉంటే.. డబ్బుల కట్టలతో దొరికిన రేవంత్ ఊచలు లెక్క పెట్టేవారు: కేటీఆర్
మరో కాంగ్రెస్ నేత ఇనగాల వెంకట్రామ్ రెడ్డి కూడా అనుచరులతో అత్యవసర సమావేశమయ్యారు. పరకాల టికెట్ ఆశించిన ఇనగాల భంగపడ్డారు. దీంతో తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. మొదటి లిస్టులో 55 మంది పేర్లు ప్రకటించిన కాంగ్రెస్. రెండో జాబితాలో 45 మంది పేర్లను ప్రకటించింది. దాంతో మొత్తం 100 స్థానాలకు గెలుపు గుర్రాలను ప్రకటించినట్టయింది. ఇంకా కాంగ్రెస్ 19 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇందులో 4 కమ్యూనిస్ట్ పార్టీలకు కేటాయించిన విషయం తెలిసిందే.