NTV Telugu Site icon

Telangana Elections 2023: నేడు బీజేపీ మూడో జాబితా.. జనసేనకు 8-10 సీట్లు?

Bjp Janasena

Bjp Janasena

Telangana BJP’s Third Candidate List Likely to Release Today: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా నేడు విడుదల అయ్యే అవకాశం ఉంది. 40కి పైగా అభ్యర్థులను బీజేపీ అధిష్ఠానం మూడో జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది. పార్టీల్లో టికెట్లు ఆశించి.. దక్కించుకోలేకపోయిన బలమైన నేతలను దృష్టిలో పెట్టుకుని కొన్ని స్థానాలను పెండింగులో ఉంచినట్టు సమాచారం తెలుస్తోంది. ఇక పొత్తుల్లో భాగంగా జనసేనకు 8 నుంచి 10 సీట్లను సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కేటాయించిందని తెలుస్తోంది.

బీజేపీ అభ్యర్థుల మూడో జాబితాపై బుధవారం ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలు కసరత్తు చేశారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో నేతలు సమావేశం అయ్యారు. ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సహా తెలంగాణ కోర్ కమిటీ నేతలు కిషన్ రెడ్డి, డీకే అరుణ, ఈటల రాజేందర్, బండి సంజయ్, డా కే లక్ష్మణ్, ప్రకాశ్ జవడేకర్ తదితరులు హాజరయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలోనే అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది.

Also Read: Vijayashanti: రాజకీయాల్లో ద్విపాత్రాభినయం సాధ్యపడదు.. ఏదైనా ఒక పార్టీకి మాత్రమే పని చేయగలం!

తెలంగాణలో మిగిలిన 66 స్థానాలపై బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. జనసేనకు పొత్తుల్లో భాగంగా ఎన్ని సీట్లు కేటాయించాలన్న విషయంపై కూడా సీఈసీ చర్చించింది. జనసేనకు 9 సీట్లు ఇచ్చేందుకు అధిష్టానం అంగీకారం తెలిపినట్టు తెలిసింది. నేడు దీనిపై ఓ క్లారిటీ రానుంది. తొలి జాబితాలో 52, రెండో జాబితాలో ఒక పేరును ప్రకటించిన బీజేపీ.. మూడో జాబితాలో 40కి పైగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మిగతా స్థానాలపై మరోసారి సీఈసీ భేటీ జరపాల్సిన అవసరం లేకుండా.. నిర్ణయాలను జేపీ నడ్డాకే వదిలేశారని తెలుస్తోంది.