TG Education: స్కూల్ ఫీజుల నియంత్రణపై కీలక అడుగు.. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ..

Ts Govt Schools

Ts Govt Schools

తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు , పారదర్శకతను పెంచేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి అన్ని ప్రైవేట్ యాజమాన్యాలు తమ పాఠశాలల్లోని తరగతుల వారీ ఫీజు వివరాలను తప్పనిసరిగా బహిరంగపరచాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ప్రతి ప్రైవేట్ పాఠశాల తమ ఫీజుల వివరాలను ప్రాంగణంలోని నోటీస్ బోర్డుపై స్పష్టంగా ప్రదర్శించడంతో పాటు పాఠశాల అధికారిక వెబ్‌సైట్‌లోనూ ఉంచాల్సి ఉంటుంది.

అంతేకాకుండా.. విద్యాశాఖ అధికారిక పోర్టల్ schooledu.telangana.gov.in లో కూడా ఈ వివరాలను అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది. ఫీజులను ఏ ఆధారంగా నిర్ణయించారో తెలిపే పత్రాలను, గవర్నింగ్ బాడీ సభ్యుల సంతకాలతో కూడిన తీర్మాన ప్రతులను కూడా పోర్టల్‌లో దాఖలు చేయడం తప్పనిసరి చేశారు. జీఓ ఎంఎస్ నెం.1 (1994) లోని 16, 18 నిబంధనల ప్రకారం ఫీజు వివరాలను ప్రదర్శించని పాఠశాలలకు జిల్లా విద్యాధికారులు (DEO) తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు.

ఈ నిబంధనలను ఉల్లంఘించే పాఠశాలలపై జీఓ ఎంఎస్ నెం.1 లోని రూల్ 11 ప్రకారం పాఠశాల అనుమతులు లేదా గుర్తింపు రద్దు చేయడం వంటి కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ ఉత్తర్వుల అమలును జిల్లా విద్యాధికారులు మరియు ప్రాంతీయ సంయుక్త డైరెక్టర్లు (RJD) నిరంతరం పర్యవేక్షించాలని, తల్లిదండ్రులపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడకుండా పారదర్శకతను కాపాడాలని విద్యాశాఖ ఆదేశించింది.