పది జిల్లాలకు కొత్తగా నియమితులైన జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణి పోర్టల్ వ్యవస్థపై వారికి అవగాహన కల్పించారు సీఎస్. ముందు చూపుతో చేసిన సూచనల ప్రకారం ధరణి పోర్టల్ ను అభివృద్ధి చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. భూ రికార్డులను సమగ్రంగా ఏకీకృతంగా నిర్వహించుటకు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఇది ఒకటి అని… భూ సమస్యలను పరిష్కరించడానికి దేశంలోని మరే ఇతర రాష్ట్రంలో ఈ వ్యవస్థను అమలు చేయడం లేదని అన్నారు.
ధరణి ప్రారంభించిన ఒక సంవత్సరం కాలం లోనే 8 లక్షలకు పైగా లావాదేవీలు జరిగాయని… ధరణి పోర్టల్ ఇప్పటివరకు 4 కోట్లకు పైగా హిట్లను పొందిందని తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, పారదర్శకంగా పనిచేసే విధంగా ధరణి మాడ్యూల్స్ ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ధరణి ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం ఆన్ లైన్ స్లాట్ బుకింగ్ ఆధారంగా మాత్రమే పని చేస్తుందని ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. ఈ వ్యవస్థను సక్రమంగా అమలు చేసేలా చూడాలని, పెండింగ్ లో ఉన్న ధరణి గ్రీవేన్స్ ను క్లియర్ చేయడానికి ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ధరణి గ్రీవేన్స్ ను పరిష్కరించడంపై ఉదాహరణలతో జిల్లా కలెక్టర్లకు వివరించారు.