OTR: తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమశిక్షణ కట్టు తప్పుతోందా? ఏకంగా పీసీసీ పిలుపు అన్నా… లెక్కలేకుండా పోతోందా? వచ్చి వివరణ ఇవ్వమని స్వయంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పిలిస్తే ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళు చెబుతున్న కారణాల గురించి పార్టీ వర్గాలు ఏమనుకుంటున్నాయి? ఢిల్లీ లొల్లి గాంధీభవన్ గేటు బయటే ఆగిపోవడానికి కారణాలేంటి?
తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఒకటే చర్చ. అంతా.. ఆ రచ్చ గురించే.. అంత లెక్కలేనితనమా? పార్టీ నాయకత్వం అంటే వాళ్ళిద్దరికీ మరీ అంత అలుసైపోయిందా అంటూ గాంధీభవన్‌లో ఒకటే గుసగుసలు. పీసీసీ అధ్యక్షుడు పిలిస్తే.. ఎమ్మెల్యే.. మంత్రి రాకపోవడం ఏంటనే చర్చ పార్టీ వర్గాల్లో విపరీతంగా జరుగుతోందట. డ్యామేజ్ కంట్రోల్ కోసం రాష్ట్ర నాయకత్వం ప్రయత్నిస్తుంటే.. ఇద్దరు ప్రజా ప్రతినిధులు మాత్రం అస్సలు సహకరించడం లేదని అర్ధమవుతోందంటున్నాయి పార్టీ వర్గాలు. మినిస్టర్ దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు మధ్య ఇటీవల ఢిల్లీలోని ఓ హోటల్లో జరిగిన వివాదానికి సంబంధించి వివరణ కోరేందుకు ప్రయత్నించారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఇద్దర్నీ గాంధీభవన్‌కు రమ్మని పిలిచారు. అయితే.. అనివార్య కారణాలతో రాలేకపోతున్నామంటూ ఇద్దరూ డుమ్మా కొట్టేశారు. నేతలిద్దరూ వస్తారనుకుని వాళ్ళకు ఇచ్చిన టైం స్లాట్‌లో.. దాదాపు రెండున్నర గంటలపాటు పార్టీ ఆఫీస్‌లో కూర్చుని ఎదురు చూశారట పీసీసీ అధ్యక్షుడు. పిలిచి మాట్లాడి, జరిగిన వివాదాన్ని సెట్ చేసి ఇద్దరు ప్రజా ప్రతినిధుల మధ్య వాతావరణాన్ని తేలిక పరచాలనుకున్న పీసీసీ చీఫ్‌కి చివరికి చేదు అనుభవం ఎదురైందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఈ పరిణామంతో కాస్త అసహనానికి గురైన పీసీసీ అధ్యక్షుడు ఇక్కడ ఏం జరిగిందన్న విషయాన్ని పూసగుచ్చినట్టు నేరుగా అధిష్టానానికి నివేదించినట్టు తెలిసింది. మంత్రికి, ఎమ్మెల్యేకి మధ్య ఢిల్లీ హోటల్లో ఏం జరిగిందనే దానికంటే… ఆ తర్వాతి పరిణామాలే చర్చనీయాంశం అవుతున్నాయి.
పార్టీలో అసలు క్రమశిక్షణ ఉందా అన్న ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయట. డిసిప్లిన్ ఉన్న లీడర్స్ ఎవరైనా సరే.. పార్టీ నాయకత్వం పిలిచిందంటే.. తప్పనిసరిగా గాంధీభవన్ గడప తొక్కాల్సిందే, వివరణలు ఇచ్చుకోవాల్సిందే. ఇక ఆ తర్వాతి సంగతి తర్వాత. కానీ.. వీళ్ళిద్దరూ ఎందుకు రాలేదన్న చర్చోప చర్చలు పార్టీ వర్గాల్లో జరుగుతున్నాయి. మంత్రి దామోదర రాజనర్సింహ కంటికి ఆపరేషన్ అవడంతో ఇబ్బంది పడుతున్నారట. ఆ కారణంతో రాలేకపోయానని పీసీసీకి సమాధానం పంపారాయన. కానీ.. మంత్రి రాలేదన్న కారణంతో ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు కూడా ముఖం చాటేయడంతో ఇష్యూ మరింత సీరియస్ అయ్యిందని అంటున్నారు. ఏఐసీసీలో పరిచయాలు ఉన్నంత మాత్రాన ఎమ్మెల్యే.. తనకు సంబంధం లేని జిల్లాలో.. నియోజకవర్గంలో వేలు పెట్టడం ఏంటన్నది మంత్రి రాజనర్సింహ వ్యక్తం చేస్తున్న ప్రధాన అభ్యంతరం. ఇదే విషయాన్ని ఆయన పీసీసీకి చెప్పేస్తే సరిపోయేది. కానీ.. ఇప్పుడు ఇటు మంత్రి.. అటు ఎమ్మెల్యే ఇద్దరూ పార్టీ నాయకత్వం ఆదేశాలని పాటించలేదన్న ఫీలింగ్ క్యాడర్ దాకా వెళ్ళింది. దీంతో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఈ వివాదంలో వేలు పెట్టడంకంటే అసలు విషయాన్ని అధిష్టానానికి చెప్పడం మేలని భావించారట. అందుకే ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కి ఒక నివేదిక పంపింనట్టు చెప్పుకుంటున్నారు. ఇక, ఆ వివాదానికి సంబంధించి ఇద్దర్నీ గాంధీభవన్‌కు పిలిచాం. కానీ, ఎవ్వరూ హాజరు కాలేదు.. ఇదే విషయాన్ని మీకుతెలియజేస్తున్నానంటూ ఒక లేఖను ఏఐసీసీకి పంపించారట మహేష్ గౌడ్. మరోవైపు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుథ్ చేసిన వ్యాఖ్యలపై కూడా మరో నివేదికను పంపించేశారు. అనిరుధ్ వ్యాఖ్యలు పార్టీకి.. ప్రభుత్వానికి నష్టం కలిగించేలా ఉన్నాయంటూ ఆ నివేదికలో ఉన్నట్టు తెలిసింది. అనిరుథ్ రెడ్డిని సెట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయపడ్డారట పీసీసీ చీఫ్. ఇక ఆ ఇద్దరు నేతలు పిలిచినప్పుడు రాకపోవడంపై కాస్త గట్టిగానే హర్ట్ అయ్యారట పీసీసీ చీఫ్. అందుకే బంతిని ఢిల్లీ కోర్ట్‌లోకి నెట్టేశారన్నది కాంగ్రెస్ వర్గాల వాయిస్.

