NTV Telugu Site icon

Delimitation: జనాభా నియంత్రణ శాపం కాకూడదు.. అవసరమైతే పోరాట బాట పడుదాం: సీఎం రేవంత్

Cm Revanth Reddy

Cm Revanth Reddy

డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. డీలిమిటేషన్‌ వల్ల జనాభా నియంత్రణ శాపం కాకూడదన్నారు. డీలిమిటేషన్‌ వల్ల జనాభాను నియంత్రించిన రాష్ట్రాలు నష్టపోకూడదని, ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలనే కొనసాగించాలన్నారు. పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదని, రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని నియోజకవర్గ పునర్విభజన చేయాలన్నారు. అన్ని పార్టీలతో సంప్రదింపుల తర్వాతనే లోక్సభ సీట్ల పునర్విభజన చేయాలని సీఎం పేర్కొన్నారు.

‘ పునర్విభజన పారదర్శనకంగా జరగాలి. జనాభా నియంత్రణ శాపం కాకూడదు. జనాభా వాటా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు. జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని నియోజకవర్గ పునర్విభజన చేయాలి. అటల్ బిహారీ వాజపేయి కూడా పునర్విభన 25 ఏండ్లు వాయిదా వేశారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలనే ఆలోచన సరికాదు. కేంద్రమే నిర్ణయం తీసుకోలేదు అని కేంద్ర మంత్రి అంటున్నారు. కేంద్రానికి తెలంగాణ సభ నుండి తీర్మానం చేసి పంపాలని నిర్ణయం తీసుకున్నాం’ అని శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

‘కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన, నియోజకవర్గాల పెంపుపై చర్చ జరుపుతోంది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం చెడిపోతుందని ఆనాడు ఇందిరా గాంధీ భావించారు. అందుకే చట్టాన్ని సవరించి పునర్విభజన చేశారు. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన అంశం మళ్లీ చర్చకు రావడంతో దక్షిణాదిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగేలా కేంద్రం వ్యవహరిస్తే ఖచ్చితంగా మనం ఎదుర్కోవాలి. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలు చేశాయి. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం 24 శాతం 19 శాతానికి పడిపోయే ప్రమాదం ఉంది. దక్షిణాది రాష్ట్రాలను నియంత్రించడానికి నియోజకవర్గాల పునర్విభజనను కేంద్రం వినియోగించుకుంటోంది. రాజకీయాలకు అతీతంగా దీనిపై ఒకే మాటపై నిలబడి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. అందుకే ఇవాళ సభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టాం’ అని సీఎం పేర్కొన్నారు.

‘ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాలను పునర్విభజన చేయాలి. కానీ కేంద్ర ప్రభుత్వం మనపై వివక్ష చూపుతోంది. 2026 జనాభా లెక్కింపు తర్వాతే చేపడతామని ఆనాడు పార్లమెంట్లో నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో రాజ్యాంగాన్ని సవరించి 2011 జనభా లెక్కల ప్రకారం నియోజకవర్గాలను 83 నుంచి 90కి పెంచారు. సిక్కింలో 2018లో కేబినెట్లో రిసోల్యూషన్ పాస్ చేసి ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ విధానాలను ప్రజల ముందుంచేందుకే సభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టాం. రాజకీయాలకు అతీతంగా పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిద్దాం. అవసరమైతే పోరాట బాట పడుదాం. త్వరలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జానారెడ్డి ఆధ్వర్యంలో అన్ని పార్టీలతో సమావేశం నిర్వహిస్తాం. ఈ సమావేశానికి అందరూ రావాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.