Site icon NTV Telugu

TG Cabinet : రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్‌ భేటీ

Cm Revanth

Cm Revanth

తెలంగాణ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్దిష్ట షరతులతో చర్చించడానికి ఆమోదం తెలిపింది. తెలంగాణ కేబినెట్ సమావేశంలో అత్యవసర అంశాలను మాత్రమే ప్రస్తావించాలని ఈసీ షరతు విధించింది. తక్షణం అమలు చేయాల్సిన అజెండా అంశాలపైనే మంత్రివర్గ సమావేశంలో దృష్టి సారించాలని స్పష్టం చేసింది. అదనంగా, లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు రైతు రుణమాఫీ అంశాన్ని వాయిదా వేయాలని EC నిర్ణయించింది. ఈ నేపథ్యంలో.. రేపు తెలంగాణ కేబినెట్‌ భేటీ కానుంది. సీఈసీ గ్రీన్‌సిగ్నల్‌తో రేపు మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గం సమావేశం జరగనుంది. కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి.. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికపై ఈ భేటీలో చర్చించనున్నారు. నివేదికలోని సిఫారసులు, తదుపరి కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది కేబినెట్‌. అలాగే.. ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై సమీక్షించనుంది. వచ్చే ఖరీఫ్‌ పంటల ప్రణాళికపైనా మంత్రివర్గంలో చర్చ జరగనుంది.

రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై చర్చించే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే.. జూన్‌ నుంచి కొత్త విద్యా సంవత్సరం అమలవుతున్న నేపథ్యంలో.. స్కూల్‌, కాలేజీల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది కేబినెట్‌. పాఠ్య పుస్తకాలు, విద్యార్థుల యూనిఫామ్‌ల పంపిణీ తదితర అంశాలపై చర్చించనుంది.

Exit mobile version