Site icon NTV Telugu

Digital Health Cards: ప్రభుత్వ ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డులు..

తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలకమైన 2026-27 వార్షిక బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో ప్రజా ఆరోగ్యంపై ప్రభుత్వం చూపిస్తున్న చిత్తశుద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవల నాణ్యతను పెంచే లక్ష్యంతో వైద్యారోగ్య శాఖకు రూ.13,679 కోట్ల భారీ నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఈ బడ్జెట్ ప్రసంగంలో మంత్రి భట్టి విక్రమార్క ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లు ఎంతో కాలంగా ఆశిస్తున్న ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS) అమల్లోకి తెస్తున్నట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా.. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు, 421 గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందవచ్చు. దాదాపు 1,998 రకాల వ్యాధులకు ఎటువంటి ముందస్తు చెల్లింపులు లేకుండా (Cashless) వైద్యం అందుతుంది. ప్రతి ఉద్యోగికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక డిజిటల్ హెల్త్ కార్డులను అందజేయనున్నారు.

వైద్య మౌలిక సదుపాయాల విస్తరణ..

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు నిర్మిస్తున్న మూడు టిమ్స్ (TIMS) ఆసుపత్రులను ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే.. నిమ్స్ ఆసుపత్రి విస్తరణ పనులు, వరంగల్‌లో నిర్మిస్తున్న అత్యధునిక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాలను వేగవంతం చేస్తామన్నారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 6,582 టెర్షియరీ కేర్ బెడ్లు రోగులకు అందుబాటులోకి వస్తాయి.

వైద్య విద్యారంగంలో సాధించిన ప్రగతిని వివరిస్తూ.. రాష్ట్రంలో ఇప్పటికే కొత్తగా 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ స్కూల్స్, 28 పారామెడికల్ కళాశాలలను ప్రారంభించినట్లు మంత్రి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు వైద్య వ్యవస్థను పటిష్టం చేయడమే ఈ బడ్జెట్ ప్రధాన ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు.

 

Exit mobile version