Site icon NTV Telugu

BC Reservations: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు!

Supreme Verdict On Telangana Bc Reservations

Supreme Verdict On Telangana Bc Reservations

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ)ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. 50 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లండని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని ధర్మాసనం హైకోర్టుకు సూచించింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం తదుపరి తీసుకునే చర్యలపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో జరుగనున్నకేబినెట్ భేటీలో ఈ అంశంపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీఓ 9పై హైకోర్టు విధించిన స్టేను సవాల్‌ చేస్తూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు 50 శాతం మించొద్దనే అభిప్రాయం సరికాదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కులగణన సర్వే జరిగిందని, ప్రభుత్వం ఇంటింటి సర్వే చేసి లెక్క తేల్చిందని సర్వోన్నత న్యాయస్థానంకు వివరించారు. రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని, 3 నెలలు దాటినా బిల్లుపై గవర్నర్ నిర్ణయం తీసుకోలేదని అభిషేక్ సింఘ్వీ వాదించారు.

రిజర్వేషన్లు 50 శాతం మించొద్దన్న తీర్పులు స్పష్టంగా ఉన్నాయని, కృష్ణమూర్తి జడ్జిమెంట్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పిందని ప్రతివాది లాయర్ వాదనలు బలంగా వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది. కావాలనుకుంటే పాత రిజర్వేషన్ల ఆధారంగా స్థానిక ఎన్నికలకు వెళ్లవచ్చని పేర్కొంది.

Exit mobile version