KTR Injured: తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద తోపులాట.. కేటీఆర్‌ నుదుటికి, చేతికి గాయం!

Ktr Injured

Ktr Injured

KTR Injured at Telangana Assembly Gate: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్‌ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు గేటు వద్ద అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వ హామీల అమలును డిమాండ్‌ చేస్తూ.. బీఆర్ఎస్‌ నేతలు నినాదాలు చేస్తూ అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

బీఆర్ఎస్‌ నేతలు స్లోగన్లతో కూడిన నల్ల టీషర్టులు ధరించి రావడంతో.. స్పీకర్‌ ఆదేశాల మేరకు అసెంబ్లీ లోపలికి అనుమతించలేమని పోలీసులు స్పష్టం చేశారు. టీషర్టులు తొలగించి సభలోకి వెళ్లాలని పోలీసులు కోరినప్పటికీ.. బీఆర్ఎస్‌ నేతలు నిరసన కొనసాగిస్తూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌కు నుదుటిపై, చేతికి గాయాలైయ్యాయి. మరోవైపు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి కాలికి కూడా గాయం అయింది.

తోపులాట అనంతరం పోలీసులు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వారిని అసెంబ్లీ గేటు వద్ద నుంచి తెలంగాణ భవన్‌కు తరలించారు. ప్రస్తుతం కేటీఆర్‌, హరీశ్‌రావు, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణ భవన్‌లో ఉన్నారు. మరోవైపు ఈ ఘటనపై బీఆర్ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ గేటు వద్ద తమతో వ్యవహరించిన తీరు అవమానకరంగా ఉందని ఆరోపించారు. తమ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ విషయాన్ని స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

మరోవైపు పోలీసులు మాత్రం తాము స్పీకర్‌ ఆదేశాలను అమలు చేశామని చెప్పారు. నల్ల టీషర్టులతో అసెంబ్లీలోకి అనుమతించకూడదని ఆదేశాలు ఉండటంతో.. టీషర్టులు మార్చుకుని సభకు వెళ్లాలని సూచించామని, కానీ బీఆర్ఎస్‌ నేతలు నిరసనకు దిగడంతో వారిని అరెస్ట్ చేసి తెలంగాణ భవన్‌కు తరలించామని డీసీపీ శిల్పవల్లి వివరించారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభ దశలోనే అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్ఎస్‌ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం చర్చనీయాంశంగా మారింది.