Site icon NTV Telugu

Komatireddy vs Harish Rao: డిప్యూటీ లీడరా? ఎమ్మెల్యేనా?.. మంత్రి, ఎమ్మెల్యే మధ్య వాడీవేడి సంభాషణ!

Komatireddy Vs Harish Rao

Komatireddy Vs Harish Rao

శాసనసభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌ రావు మధ్య వాడీవేడి సంభాషణ జరిగింది. క్వశ్చన్‌ అవర్‌లో ఒక మంత్రి.. మరొక మంత్రిని ప్రశ్న అడగడం ఏంటని హరీశ్‌ రావు ప్రశ్నించారు. మంత్రులే ప్రశ్నలు అడిగితే.. ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుందన్నారు. అందుకు కోమటిరెడ్డి ఘాటుగా స్పందించారు. హరీశ్‌ రావు బీఆర్ఎస్‌కు డిప్యూటీ లీడరా?, ఎమ్మెల్యేనా?.. ఏ హోదాతో మాట్లాడుతున్నారు?, ఆయనకు ప్రశ్నించే హక్కు లేదన్నారు. ప్రతిపక్ష నేత ఏడాదిగా సభకు రాకపోవడం తెలంగాణ ప్రజలను అవమానపరచడమే అని కోమటిరెడ్డి అన్నారు.

క్వశ్చన్‌ అవర్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ… ‘నల్గొండ జిల్లాలోని ప్రజలు ఓ వైపు ఫ్లోరైడ్‌, మరోవైపు మూసీ మురుగు నీటితో ప్రజలు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గతంలో కాంగ్రెస్‌ హయాంలో 70 శాతం పూర్తి చేసిన ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టింది. ఈ 10 ఏళ్లలో రూ.7లక్షల కోట్ల అప్పు చేసినా.. ప్రాజెక్టును మాత్రం పూర్తిచేయలేదదు. కాంగ్రెస్ ప్రభుత్వం గంధమల్ల రిజర్వాయర్‌ పనులు పూర్తి చేస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 40 లక్షల మంది జీవితాలను కాపాడాలని జలవనరుల శాఖ మంత్రి (ఉత్తమ్‌ కుమార్ రెడ్డి)ను కోరుతున్నా. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అందరూ నల్గొండ జిల్లాకు అండగా నిలబడ్డారు. వారికి నా ధన్యవాదాలు’ అని అన్నారు.

ఎమ్మెల్యే హరీశ్‌ రావు మాట్లాడుతూ సభలో ఒక మంత్రి లేచి.. మరో మంత్రిని ప్రశ్నించే పరిస్థితి ఉండకూడదన్నారు. ఇలా ప్రశ్నలు అడిగేందుకు అవకాశమిస్తే ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుందని, కొత్త సంస్కృతిని సభలో తీసుకురావద్దని స్పీకర్‌ స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ను కోరారు. ఉమ్మడి రాష్ట్రాన్ని ఎక్కువకాలం పాలించింది కాంగ్రెస్‌ పార్టీనే అని, తమ ప్రభుత్వ హయాంలో ఎస్సారెస్పీ స్టేజ్‌-2 పనులు పూర్తిచేసి కాళేశ్వరం జలాలను ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు అందించామని హరీశ్‌ రావు చెప్పారు. దీనిపై చర్చ పెట్టండి.. ఎవరేం చేశారో చర్చిద్దామని సవాల్ విసిరారు. గతంలో కోమటిరెడ్డి మంత్రిగా ఉన్నారని, ఆయన హయాంలోనే మూసీ ఈవిధంగా తయారైందని హరీశ్‌రావు సెటైర్లు వేశారు.

అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. హరీశ్‌ రావు బీఆర్ఎస్‌కు డిప్యూటీ లీడరా?, ఎమ్మెల్యేనా?.. ఏ హోదాతో మాట్లాడుతున్నారు?, ఆయనకు ప్రశ్నించే హక్కు లేదన్నారు. ప్రతిపక్ష నేత ఏడాదిగా సభకు రాకపోవడం తెలంగాణ ప్రజలను అవమానపరచడమేనన్నారు. నల్గొండ ప్రజల కడుపులో ఆవేదన ఎలా ఉంటుందో తాను చెప్పానని.. డబ్బున్న వాళ్లు హైదరాబాద్‌ వచ్చారని, లేని వాళ్లు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో హరీశ్‌ రావు ఒక్కసారీ ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వద్దకు రాలేదని.. ఆయనకు నల్గొండ గురించి, తన గురించి మాట్లాడే హక్కు లేదని కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు.

Exit mobile version