Site icon NTV Telugu

AP Telangana Officers Meet: ఎక్కడి సమస్యలు అక్కడే.. పురోగతి లేని చర్చలు

Home Ajay

Home Ajay

ఏపీ తెలంగాణ విభజన జరిగి ఎనిమిదేళ్ళు పూర్తవుతున్నా.. ఇంకా విభజన అనంతరం సమస్యలకు ఇంకా మోక్షం లభించడం లేదు. ఎన్నిసార్లు ఉభయ తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం జరిగినా చర్చలలో పురోగతి కనిపించడం లేదు. ఢిల్లీలో మరోమారు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. ఏపీకి రైల్వే జోన్ ఏర్పాటు లాభదాయకంగా లేదన్నారు రైల్వే బోర్డు ఛైర్మన్ వి.కే.త్రిపాఠి. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు నిర్ణయం ఎలా తీసుకొంటుందని ప్రశ్నించారు కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా.

Read Also: Mallareddy Narayana Hospital: మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ వరల్డ్ హార్ట్ డే ఈవెంట్

కేంద్ర మంత్రివర్గం దృష్టి కి తీసుకెళ్ళాలని, తుది నిర్ణయం తీసుకుంటుందని సూచించారు అజయ్ భల్లా. అమరావతి రాజధాని నిర్మాణం కోసం శివరామ కృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సు మేరకు 29 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరారు ఏపీ ప్రభుత్వ అధికారులు. చట్ట ప్రకారం 2500 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇప్పటికి 1500 కోట్ల రూపాయలు విడుదల చేశాం. ఈ మొత్తానికి సంబంధించిన ఖర్చుల ధృవీకరణపత్రాలను ( యు.సి) సమర్పించాలని, ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని ( రూ. 1000 కోట్లు) విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని సూచించారు కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా.

విభజన చట్టంలోని 9 వ షెడ్యూల్ లో ఆస్తుల విభజన పై షీలా బేడీ కమిటీ ఇచ్చిన సిఫార్సులను ఏపీ అంగీకరించిందని, తెలంగాణ వ్యతిరేకించిందని తెలిపారు రాష్ట్ర అధికారులు. షీలా బేడీ కమిటీ సిఫార్సులు తప్పనిసరి అమలుకు కేంద్రమే ఉత్తర్వులు జారీ చేసేవిధంగా ఉన్న అవకాశం పై న్యాయ సలహా కోరుతామని కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా పేర్కొన్నారు.

మరోవైపు తెలంగాణకు మాత్రమే సంబంధించిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ, వెనుక బడిన జిల్లాల కు నిధుల మంజూరు అంశాల ను ప్రస్తావించారు తెలంగాణ అధికారులు. వెనుక బడిన జిల్లాలకు నిధులు వెంటనే మంజూరు చేయాలని ఆర్థిక శాఖ కు హోమ్ సెక్రెటరీ ఆదేశించారు. గిరిజన వర్శిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ల పై పరిశీలించి వెంటనే నిర్ణయాలు తీసుకొవాలనీ ఆయా శాఖలకు సూచించారు హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా.

Read Also: Mumbai: బురఖా ధరించడం లేదని భార్యను హత్య చేసిన భర్త

Exit mobile version