Site icon NTV Telugu

UPSC: సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజం.. కోచింగ్ లేకుండా తొలి ప్రయత్నంలోనే విక్టరీ

Annya

Annya

మంగళవారం సివిల్స్ ఫలితాలు విడుదల కాగానే తెలుగు తేజం అనన్య రెడ్డి పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్తు దేశమంతా ఆమె పేరు అందరినోళ్లలో వినిపిస్తోంది. దీనికి ఆమె సాధించిన ర్యాంకే. చూడ్డానికి మనిషి బక్కపలచగా.. సన్నగా ఉంది. కానీ ఆమె సాధించిన ర్యాంక్ చూస్తే అందరూ నోరెళ్లబెట్టాల్సిందే. పైగా ఆమె తొలి ప్రయత్నంలోనే అసాధారణ ప్రతిభ చూపించారు. దేశంలోనే మూడో ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించింది. మహిళల్లో అయితే ఆమెనే ఫస్ట్ ర్యాంక్ సాధించింది. పదో తరగతి వరకు మహబూబ్‌నగర్‌ గీతం హైస్కూల్‌లో చదివిన అనన్య.. ఇంటర్‌ విద్యను హైదరాబాద్‌లో అభ్యసించారు. ఢిల్లీలోని మెరిండా హౌస్‌ కాలేజీలో డిగ్రీ చదివిన ఆమె ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోకుండానే ఈ ఘనతను సాధించడం మరో గొప్ప విశేషం.

సివిల్స్‌ పరీక్ష అంటేనే ఎంతో కఠినం. అలాంటిది ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా తొలి ప్రయత్నంలోనే మూడో ర్యాంక్ సాధించడం మామూలు విషయమా? ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూలలో ఎదురయ్యే కఠిన సవాళ్లను ఎదుర్కొని నిలబడడం ఆషామాషీ వ్యవహారం కాదు. అలాంటిది తొలి ప్రయత్నంలోనే ఎలాంటి కోచింగ్‌ తీసుకోకుండా సొంత ప్రిపరేషన్‌తో సివిల్స్‌లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించి అందరి చేత ప్రశంసలు పొందుతోంది.

తాను రెండేళ్లుగా యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్నట్లు అనన్య రెడ్డి తెలిపారు. తొలి ప్రయత్నంలోనే ఈ ర్యాంకు సాధించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు సేవ చేస్తూ ప్రయాణం సాగిస్తానని తెలిపారు.  మూడో ర్యాంకు వస్తుందని మాత్రం అస్సలు అనుకోలేదని ఆమె చెప్పారు. సొంత ప్రణాళికతోనే రోజుకు 12 నుంచి 14 గంటల పాటు చదివినట్లు తెలిపారు. చిన్నప్పటినుంచే సమాజానికి సేవ చేయాలన్న కోరికతోనే సివిల్స్‌ను ఎంచుకున్నట్లు తెలిపారు.

ఇక ఆదిత్య శ్రీవాస్తవ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకుతో సత్తా చాటగా.. అనిమేష్‌ ప్రధాన్‌ (2), దోనూరు అనన్య రెడ్డి(3), పీకే సిద్ధార్థ్‌ రామ్‌కుమార్‌ (4), రుహాని (5), సృష్టి దబాస్‌ (6), అన్‌మోల్‌ రాఠోర్‌ (7), ఆశీష్‌ కుమార్‌ (8), నౌషీన్‌ (9), ఐశ్వర్యం ప్రజాపతి (10) ర్యాంకులతో మెరిశారు. గతేడాది విడుదలైన సివిల్స్‌ – 2022 ఫలితాల్లో తెలుగు అమ్మాయి ఉమాహారతి మూడో ర్యాంకుతో సత్తా చాటగా.. ఈసారి కూడా తెలంగాణకు చెందిన అనన్య రెడ్డి మూడో ర్యాంకు సాధించడం విశేషం.

Exit mobile version