తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతోందని, దీనికి నిరసనగా రేపు (జూన్ 23) తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్‌ను విజయవంతం చేయాలని ABVP రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, విద్యార్థులు, తల్లిదండ్రులు, మరియు పాఠశాల యాజమాన్యాలు ఈ బంద్‌కు సహకరించాలని కోరారు. రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రంలో దాదాపు 23,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌లా వ్యవహరిస్తూ, వారి విచ్చలవిడి ఫీజుల దోపిడీకి రెడ్ కార్పెట్ పరుస్తున్నారని విమర్శించారు. వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలన్నారు.
ప్రైవేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్లు కల్పించే విద్యాహక్కు చట్టాన్ని ప్రభుత్వం అటకెక్కించిందని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలు రీ-ఓపెన్ అయినా ఇంతవరకు విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ అందించలేదని, స్కూళ్లలో కనీస మౌలిక వసతులు కరువయ్యాయని ఆరోపించారు. పర్యవేక్షణ లోపాన్ని నివారిస్తూ ఖాళీగా ఉన్న MEO, DEO పోస్టులతో పాటు, టీచింగ్ మరియు నాన్-టీచింగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు. గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, మరియు అన్ని పాఠశాలల్లో “బ్రేక్ ఫాస్ట్ స్కీమ్” ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టకపోతే, ABVP ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని మాచెర్ల రాంబాబు హెచ్చరించారు.

