Site icon NTV Telugu

Bihar Elections 2025: మహిళలకు 30 వేలు, రైతులకు ఉచిత విద్యుత్.. తేజస్వి యాదవ్ వరాల జల్లు!

Tejashwi Yadav

Tejashwi Yadav

2025 అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్‌ ప్రజలపై ఆర్జేడీ నేత, మహా కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ వరాల జల్లు కురిపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు రూ.30,000 ఒకేసారి ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలానే రైతులకు పెద్ద ఎత్తున వాగ్దానాలు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్, వరిపై 300 రూపాయలు, గోధుమలపై 400 రూపాయలు బోనస్ అందిస్తామని చెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ప్రచారం చివరి దశకు చేరుకున్న సందర్భంగా తేజస్వి యాదవ్ ఈరోజే విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

మీడియా సమావేశంలో తేజస్వి యాదవ్ మాట్లాడుతూ… ‘మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మకర సంక్రాంతి (జనవరి 14) నాడు మై బెహెన్ స్కీమ్ కింద మహిళల ఖాతాల్లోకి 30,000 రూపాయలు డిపాజిట్ చేస్తాం. మహిళలకు ఆర్థికంగా సాధికారత కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం. జీవికా దీదీ వంటి కమ్యూనిటీ మొబిలైజర్లను పర్మినెంట్ చేసి రూ.30,000 గౌరవ వేతనం ఇస్తాం. జీవికా దీదీ కేడర్‌కు నెలకు రెండు వేల రూపాయలు అందిస్తాము. ఐదు లక్షల రూపాయల బీమా, వడ్డీ మాఫీ కూడా చేస్తాం’ అని హామీ ఇచ్చారు.

తేజస్వి యాదవ్ ఉద్యోగులకు అనేక వాగ్దానాలు చేశారు. తన ప్రభుత్వం ఏర్పడితే పాత పెన్షన్ పథకాన్ని అమలు చేస్తామని అన్నారు. పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు, ఆరోగ్య కార్యకర్తలు సహా ఇతర ఉద్యోగుల బదిలీలు అండ్ పోస్టింగ్‌లు వారి సొంత జిల్లాల నుంచి 70 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం PACSలకు గౌరవ హోదా ఇస్తుందని, వారి గౌరవ వేతనాన్ని పరిశీలిస్తుందని కూడా తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో నవంబర్ 6న 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ప్రచారం రోజు సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ప్రచారం ముగిసే ముందు తేజస్వి యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించి కీలక హామీలు ఇచ్చారు.

 

 

Exit mobile version