Teja Sajja Engagement: యువ హీరో తేజ సజ్జా త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌తో పాటు రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
తేజ సజ్జా నిశ్చితార్థ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోలు రవితేజ, రానా దగ్గుబాటి, శివాజీ హాజరై సందడి చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. దర్శకులు కె. రాఘవేంద్రరావు, ప్రశాంత్ వర్మ, కార్తిక్ ఘట్టమనేని, నటి వరలక్ష్మి శరత్‌కుమార్ దంపతులు, నిర్మాతలు విశ్వప్రసాద్, సాహు గారపాటి తదితరులు హాజరై నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు. తనకు కాబోయే భార్య గురించి తేజ సజ్జా గతంలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆమెకు సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదని, వ్యాపార కుటుంబానికి చెందిన యువతి అని తెలిపారు. ఆమె కుటుంబం టెక్నాలజీ వ్యాపారంలో ఉన్నట్లు చెప్పారు. అమెరికాలో పెరిగిన ఆమెతో తన వివాహం పెద్దలు కుదిర్చిన సంబంధమని, ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ పెళ్లి నిశ్చయమైందని వెల్లడించారు.
తేజ సజ్జా వివాహం డిసెంబర్లో రాజస్థాన్‌లోని ఉదయ్పుర్లో జరగనున్నట్లు సమాచారం. అక్కడే పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. వివాహం అనంతరం హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి తేదీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

