Tej Pratap Yadav: బీహార్ రాజకీయాలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత మరింత ఆసక్తికరంగా మారాయి. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంతో పాటు పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తేజ్ పత్రాప్ యాదవ్ సొంతంగా పార్టీని స్థాపించి, దానికి జనశక్తి జనతాదళ్ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో ఈ పార్టీ 22 మంది అభ్యర్థులను నిలబెట్టింది. ఎన్నికల ఫలితం అనంతరం ఆదివారం తేజ్ ప్రతాప్ యాదవ్ నివాసంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోటీ చేసిన అభ్యర్థులు తమ ఓటమిపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం జనశక్తి జనతాదళ్ ఎన్డీఏకు నైతిక మద్దతు ఇవ్వాలని నిర్ణయించిందని జేజేడీ జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ యాదవ్ వెల్లడించారు.
READ ALSO: Andhra Pradesh:విశాఖలో మేనేజ్ మెంట్ ఇన్ స్టిట్యూట్ హోటల్ ప్రాజెక్ట్.. 2000 మందికి ఉపాధి
ఈ సందర్భంగా మొదటి సారి తేజ్ పత్రాప్ యాదవ్ తన కుటుంబ కలహాలపై స్పందించారు. సోదరి రోహిణి ఆచార్యకు జరిగిన అవమానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భరించలేనని ఆయన అన్నారు. తన కుటుంబంపై దాడి చేసే వారిని బీహార్ ప్రజలు క్షమించరని హెచ్చరించారు. తన తమ్ముడు తేజస్వి యాదవ్ చర్యపై ఆయన మండిపడ్డారు. ‘నా సోదరి రోహిణిపై చెప్పు ఎత్తిన వార్త విన్నప్పటి నుంచి నా గుండెలో బాధ నిప్పులా మారిపోయింది. ప్రజల మనోభావాలు గాయపడినప్పుడు తెలివితేటలపై ఉన్న దుమ్ము ఎగిరిపోతుంది. ఈ కొద్దిమంది ముఖాలు తేజస్వి తెలివితేటలను కూడా కప్పేశాయి’ అన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కుటుంబ గౌరవాన్ని కాపాడటానికి తండ్రి లాలూ అనుమతిని కోరారు. ‘ఈ అన్యాయ పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. కాలాన్ని లెక్కించడం చాలా కఠినంగా ఉంటుంది. గౌరవనీయులైన ఆర్జేడీ జాతీయ అధ్యక్షుడు, నా తండ్రి, నా రాజకీయ గురువైన లాలూ ప్రసాద్ జీకి విన్నపం. తండ్రీ నాకు ఒక సిగ్నల్ ఇవ్వండి. తల ఊపితే చాలు. ఈ జైచంద్‌లకు బీహార్ ప్రజలు సమాధి కట్టేస్తారు. ఈ పోరాటం ఏ పార్టీ గురించో కాదు, ఇది ఒక కుటుంబ గౌరవం, ఒక కుమార్తె గౌరవం, బీహార్ ఆత్మగౌరవం గురించి’ అని అన్నారు.
ఓడిపోయిన తేజ్ ప్రతాప్…
తేజ్ ప్రతాప్ పార్టీ జెజెడి మొత్తం 22 మంది అభ్యర్థులను ఈ ఎన్నికల్లో బరిలోకి దింపింది. ఈ పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచిన అన్ని స్థానాల్లోనూ వారి డిపాజిట్లు గల్లంతయ్యాయి. తేజ్ తన సొంత స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయాడు. ఆయన మహువా నుంచి పోటీ చేసి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఆయన 51,938 ఓట్ల తేడాతో లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) రామ్ విలాస్‌కు చెందిన సంజయ్ కుమార్ సింగ్ చేతిలో ఓడిపోయారు.
READ ALSO: Japan Volcano Eruption: జపాన్‌లో పేలిన అగ్నిపర్వతం.. ఆకాశంలో 4.4 కిలోమీటర్లకు ఎగిసిన బూడిద!