NTV Telugu Site icon

IND vs WI: అర్థశతకంతో మెరిసిన ఇషాన్ కిషన్.. తొలి వన్డేలో భారత్‌ విజయం

India

India

IND vs WI: టీమిండియా ధాటికి రెండు టెస్టుల సిరీస్‌లో విలవిల్లాడిన ఆతిథ్య వెస్టిండీస్… వన్డే సిరీస్‌లోనూ తడబడింది. బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన తొలివన్డేలో విండీస్‌ జట్టుపై టీమిండియా అలవోకగా విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా సారథి రోహిత్ శర్మ… వెస్టిండీస్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. ఇటీవలే టెస్టు సిరీస్‌లో దారుణ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న వెస్టిండీస్‌ వన్డే సిరీస్‌లోనూ అదే తరహా ఆటతీరును ప్రదర్శించింది. ఈ సిరీస్‌ను టీమిండియా వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఉపయోగించుకోవాలనుకున్నా విండీస్‌ కనీసం 30 ఓవర్లు కూడా బ్యాటింగ్‌ చేయలేకపోయింది. అసలు ఆడుతుంది వన్డేనా లేక టీ-20 మ్యాచ్‌ అన్న అనుమానం కలిగింది. గురువారం బార్బడోస్‌ వేదికగా తొలి వన్డేలో వెస్టిండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. కనీసం పోరాడే ప్రయత్నం చేయని విండీస్‌ బ్యాటర్లలో షెయ్‌ హోప్‌ ఒక్కడే 43 పరుగులతో కాస్త పర్వాలేదనిపించాడు. ముఖ్యంగా, స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా ధాటికి కరీబియన్ బ్యాట్స్ మెన్ విలవిల్లాడారు. వీరిద్దరూ పోటీలు పడి వికెట్లు తీయడంతో, విండీస్ బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లారు. కుల్దీప్ యాదవ్ 3 ఓవర్లలో కేవలం 6 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడం విశేషం. అందులోనూ 2 మెయిడెన్ ఓవర్లున్నాయి. జడేజా 3 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా 1, ముఖేశ్ కుమార్ 1, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ తీశారు. విండీస్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ షాయ్ హోప్ చేసిన 43 పరుగులే అత్యధికం. అలిక్ అథనేజ్ 22, ఓపెనర్ బ్రాండన్ కింగ్ 17, షిమ్రోన్ హెట్మెయర్ 11 పరుగులు చేశారు. మిగతా అంతా సింగిల్ డిజిట్ స్కోరుకు పెవిలియన్ చేరారు.

Also Read: LIC Policy: ఎల్‌ఐసీ నుంచి మరో కొత్త పాలసీ..కుటుంబ ప్రయోజనాలతో పాటుగా..

115 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన భారత్‌.. 22.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్‌ కిషన్‌ అర్థశతకంతో రాణించాడు. కానీ 17వ ఓవర్‌లో మోటీ బౌలింగ్‌లో పావెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. భారత్‌ కూడా లక్ష్యఛేదనలో కాస్త తడబడింది. కానీ చివరకు పని పూర్తి చేసింది. వికెట్లు కాపాడుకునేందుకు బ్యాట్స్‌మెన్ ఆచితూచి ఆడాల్సి వచ్చింది. విండీస్‌ స్పిన్నర్లు మోటీ, కరియన్‌లు భారత బ్యాటర్లను చాలా వరకు కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. కానీ నెమ్మదిగా భారత్ విజయం సాధించింది. 23 ఓవర్లలోనే భారత్‌ తొలి వన్డేను తన ఖాతాలో వేసుకుంది. భారత్‌ బ్యాట్స్‌మెన్‌లలో 52 పరుగులతో ఇషాన్‌ కిషన్ రాణించగా.. సూర్యకుమార్ యాదవ్ 19, రవీంద్ర జడేజా 16 , రోహిత్ శర్మ 12 పరగులు చేశారు.