Site icon NTV Telugu

Team India: టీమిండియా అరుదైన రికార్డు.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి!

Team India 1014 Runs

Team India 1014 Runs

టెస్ట్ క్రికెట్‌లో భారత పురుషుల జట్టు చరిత్ర సృష్టించింది. ఓ టెస్ట్ మ్యాచ్‌లో తొలిసారి 1000 పరుగుల మార్కును అందుకుంది. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా ఈ అరుదైన రికార్డు సాధించింది. ఓ టెస్ట్ మ్యాచ్‌లో 1,000 పరుగులు దాటిన ఆరో జట్టుగా నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 427/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దాంతో మొత్తంగా భారత్ 1014 పరుగులు చేసింది.

గతంలో టీమిండియా ఓ టెస్ట్ మ్యాచ్‌లో 916 పరుగులు చేసింది. 2004 సిడ్నీ టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై 916 రన్స్ సాధించింది. ఎడ్జ్‌బాస్టన్‌ టెస్ట్ ద్వారా టీమిండియా తమ రికార్డ్‌ను మెరుగుపరుచుకుంది. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్ ఈ మార్కును దాటడం ఇదే మొదటిసారి. 1000 పరుగుల క్లబ్‌లో ఇంగ్లండ్ (1930), ఆస్ట్రేలియా (1934 మరియు 1969), పాకిస్తాన్ (2006), దక్షిణాఫ్రికా (1939) ఉన్నాయి. 1930లో జమైకాలోని కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ 1,121 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉంది.

Also Read: Toli Ekadasi 2025: తొలి ఏకాదశి రోజు ఈ ఒక్క కథ చదివితే.. అన్ని శుభాలే!

2006 ఫైసలాబాద్ టెస్ట్‌లో భారత్‌పై పాకిస్తాన్ 1,078 పరుగులు చేసి ఓ టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక రన్స్ చేసిన జాబితాలో రెండవ స్థానంలో ఉంది. 1934లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా 1,028 రన్స్ చేసి మూడవ స్థానంలో ఉంది. 1969లో సిడ్నీలో వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా 1,000 (1013) పరుగుల మార్కును దాటింది. 1939 డర్బన్ టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా 1,011 పరుగుల చేసి ఆరో స్థానంలో ఉంది. భారత్ 1,014 పరుగులతో నాల్గవ స్థానంలో ఉంది. అంతేకాదు ఓ టెస్ట్ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో అత్యధిక రన్స్ (1849 పరుగులు) చేసిన జట్టుగా టీమిండియా రికార్డుల్లో నిలిచింది.

Exit mobile version