Gautam Gambhir on India Squad against Sri Lanka: ఇటీవల జింబాంబ్వే టూర్ ముగించిన భారత్ మరో పర్యటనకు సిద్ధమైంది. శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ప్రస్తుతం లంక పర్యటనపైనే అందరి దృష్టి నెలకొంది. ఈ పర్యటనతోనే గౌతమ్ గంభీర్ కోచ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. మరోవైపు స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో.. భారత జట్టు ఎంపికపై అందరిలో ఆసక్తి పెరిగింది. జట్టులో ఎవరికి చోటు దక్కుతుంది, కెప్టెన్ ఎవరు అని ఆసక్తిగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గంభీర్ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
స్టార్ స్పోర్ట్స్ రిలీజ్ చేసిన ఓ వీడియోలో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ… భయం లేని క్రికెటర్లను జట్టులోకి ఎంపిక చేస్తానని చెప్పాడు. హిట్టర్లతో పాటు అన్ని రకాల ప్లేయర్స్ జట్టులో ఉండేలా చూస్తానన్నాడు. ‘భయం లేని ఆటగాళ్లను జట్టులోకి ఎంచుకోవాలి. 50 ఓవర్ల ఫార్మాట్‌కు సరిపోయే ఆటగాళ్లను తీసుకోవాలి. యాంకర్ ఇన్నింగ్స్ ఆడే వాళ్లు, హిట్టర్లు, ఆల్‌రౌండర్‌లు, బౌలర్లు అన్ని రకాల ఆటగాళ్లు జట్టులో ఉండాలి. గతంలో ఒకే కొత్త బంతితో ఆడేవారు. ఇప్పుడు రెండు కొత్త బంతులతో ఆడుతున్నారు. అయిదుగురు ఫీల్డర్లు సర్కిల్ లోపలే ఉండాలి. దీంతో పార్ట్ టైమ్ బౌలర్ అవసరం తగ్గిపోయింది. రివర్స్ స్వింగ్‌ను చూడలేకపోతున్నాం. ఫింగర్ స్పిన్నర్ల ఆటను కోల్పోతున్నాం. అందుకే తమ బాధ్యతలను సులువుగా అర్థం చేసుకుంటూ.. సహజసిద్ధంగా ఆడే ఆటగాళ్లు జట్టులో ఉండాలి. అలాంటి ఆటగాళ్లనే ఎంపిక చేయాలి’ అని గంభీర్ తెలిపాడు.
Also Read: IND vs SL: శ్రీలంక పర్యటన.. నేడే భారత జట్టు ప్రకటన! కెప్టెన్ ఎవరు?
భారత్, శ్రీలంక జట్ల మధ్య జూలై 27 నుంచి టీ20 సిరీస్, ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్నాయి. లంక పర్యటనకు భారత జట్లను బీసీసీఐ నేడు ప్రకటించే అవకాశముంది. బుధవారమే జట్లను ఎంపిక చేయాల్సి ఉండగా.. సెలక్షన్ కమిటీ సమావేశం గురువారంకు వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, టీమిండియా నూతన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కలిసి జట్లను ఎంపిక చేయనున్నారు.