How Team India Can Become No. 1 in All Formats: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా శుక్రవారం మధ్యాహ్నం భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ వన్డే మ్యాచ్‌కు ముందు భారత్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. తొలి వన్డేలో ఆస్ట్రేలియాను ఓడిస్తే.. భారత్ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళుతుంది. దాంతో ఒకేసారి అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచిన రెండో జట్టుగా టీమిండియా రికార్డుల్లో నిలుస్తుంది. ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్ల ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
గతంలో ఒకేసారి అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచిన జట్టుగా దక్షిణాఫ్రికా ఉంది. 2014లో హషీమ్ ఆమ్లా నేతృత్వంలో ప్రొటీస్ జట్టు ఒకేసారి అన్ని ఫార్మాట్లలో ప్రపంచ నంబర్ వన్ జట్టుగా నిలిచింది. దక్షిణాఫ్రికా తర్వాత ఆ అవకాశం ఇప్పుడు భారత్ ముందుంది. నేటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలిస్తే.. దక్షిణాఫ్రికా తర్వాత ఆ ఘనత సాధించిన రెండో జట్టుగా భారత్ రికార్డుల్లో నిలుస్తుంది. మరి పటిష్ట ఆస్ట్రేలియాను భారత్ ఓడిస్తుందో లేదో చూడాలి.
అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచిన ఘనతను భారత్ సాధించిందని ఈ ఏడాది ఆరంభంలో సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఐసీసీ వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపం కారణంగానే అలా జరిగిందని తేలింది. ఇప్పుడు ఆ అవకాశం భారత్‌కు మళ్లీ వచ్చింది. ఒకేసారి అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలవడం మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ హయాంలో కూడా టీమిండియాకు సాధ్యం కాలేదు. రోహిత్ శర్మ ఆ అరుదైన ఘనతను అందుకునే అవకాశం ఉంది.