AP Crime: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత పలు ప్రాంతాల్లో హింస చెలరేగింది.. మరోవైపు ఫలితాలు వెల్లడైన తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి.. ఇక, నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం చింతలాయ పల్లె గ్రామంలో టీడీపీ కార్యకర్త మంజుల నాగేంద్ర అనే 40 ఏళ్ల వ్యక్తి దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి గ్రామ సమీపంలోని గంగమ్మ రహదారి మార్గం నుండి వస్తున్న నాగేంద్రపై ప్రత్యర్ధులు ఇనుప సుత్తి, కర్రలు, బండరాళ్లలో దాడిచేశారు.. దారుణంగా కొట్టి హత్య చేశారు.
Read Also: Khalistan: గోల్డెన్ టెంపుల్‌లో ఖలిస్తానీ నినాదాలు.. భింద్రన్‌వాలే పోస్టర్ల ప్రదర్శన..
పోలీసు రికార్డుల్లో ఫ్యాక్షన్ సమస్యాత్మక గ్రామంగా ఉన్న చింతలాయ పల్లెలో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంటుంది. గత 2019 ఎన్నికలు పూర్తయిన కొద్ది రోజుల్లోనే టీడీపీ నాయకుడు మంజుల సుబ్బారావును వైసీపీకి చెందిన ప్రత్యర్థులు బెలుంగుహల వద్ద బండరాళ్లతో కొట్టి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన అప్పట్లో జిల్లాలో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ ఏడాది ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెలువడగానే అదే గ్రామంలో మరో టీడీపీ కార్యకర్త దారుణ హత్య ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 2019లో హత్య గురైన మంజుల సుబ్బారావుకు బంధువైన.. మంజుల నాగేంద్ర ప్రస్తుతం హత్యకు గురయ్యాడు.. ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన నాగేంద్రను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, తలకు బలమైన గాయాలు కావడం.. తీవ్ర రక్త స్రావం కావడంతో బాధితుడు నాగేంద్ర కోలుకోలేక మృతి చెందాడు. అయితే, ఈ వ్యవహారంపై పోలీసులు స్పందించనట్టుగా తెలుస్తోంది.