Off The Record: ఏం…. నాకేం తక్కువ? నాకు ఎందుకు ఇవ్వరు గవర్నర్ పదవి? గౌరవంగా రిటైర్ అవుదామని నాకు మాత్రం ఉండదా? నాకు మాత్రం మనసు లేదా? దానికి మనోభావాలు ఉండవా? అవి హర్ట్ అవవా అని అంటున్న ఆ టీడీపీ సీనియర్ ఎవరు? పార్టీ అధిష్టానం ఆయన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? అశోక్‌గజపతికి పదవి వచ్చాక ఆయనలో అసహనం కట్టలు తెంచుకుంటోందన్నది నిజమేనా? ఎవరా టీడీపీ సీనియర్? ఎంటా వ్యథ?
యనమల రామకృష్ణుడు.. టిడిపి సీనియర్ లీడర్. పార్టీ ఆవిర్భావం నుంచి 2004 వరకు తుని నుంచి నాన్ స్టాప్ ఎమ్మెల్యే. 2009లో తొలి ఓటమితో ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారాయన. 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్సీ హోదాలో మంత్రి అయి… పార్టీలో తన హవా తగ్గలేదని నిరూపించుకున్నారు. కానీ… 2024లో తొలిసారి రామకృష్ణుడు లేకుండా టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ఏడాదిలో ఎమ్మెల్సీగా కూడా రిటైర్ అయ్యారు యనమల. రెన్యువల్ చేస్తారని ఆశలు పెట్టుకున్నా… పార్టీ పెద్దలు ఇక చాల్లే అనడంతో… బలవంతపు రిటైర్‌మెంట్ తప్పలేదు. ఎమ్మెల్సీ పదవీకాలం ముగిశాక…. 42 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం పేరుతో సభ ఏర్పాటు చేసి పార్టీలో, ప్రభుత్వంలో తన అనుభవాలను పుస్తకం రూపంలో విడుదల చేశారు రామకృష్ణుడు. అదంతా గతం.
ఇక రామకృష్ణుడు కూడా… తనకు వేరే పదవులు ఇచ్చే ఉద్దేశం పార్టీకి లేదని తెలుసుకుని సైలెంట్ అయ్యారు. జీవితంలో ఒక్కసారైనా రాజ్యసభకు వెళ్ళాలన్న కోరిక తీరకుండానే రిటైర్ అయిపోయారాయన. సరే…. పొలిటికల్ జర్నీకి గౌరవప్రదమైన ముగింపు ఇద్దామనుకుని ఫైనల్‌గా గవర్నర్‌గిరీ ఇప్పించమని పార్టీ పెద్దల్ని అడిగారట మాజీ మంత్రి. కేంద్రంలో టీడీపీ కీలకంగా ఉంది కాబట్టి…పార్టీ కోటాలో తనకు ఆ పదవి కచ్చితంగా వస్తుందని లెక్కలు వేసినట్టు తెలిసింది. కానీ… ఆ పోస్ట్ తనకు రాకపోగా…. మరో సీనియర్ అశోక్‌గజపతిరాజుకు దక్కడంతో… లోలోపల రగిలిపోతున్నట్టు సమాచారం. మొగుడు కొట్టినందుకు కాదుగానీ… తోటి కోడలు నవ్వినందుకు అన్నట్టుగా… తనకు గవర్నర్‌గిరీ రాకపోగా… అశోక్ ఎలా వచ్చిందంటూ… అత్యంత సన్నిహితులో అంటున్నట్టు తెలుస్తోంది. పార్టీ కోటాలో వచ్చిన పదవిని తనకు ఇవ్వకపోవడంపై మండిపడుతున్నారట ఆయన.
గతాన్ని గుర్తు చేసుకుంటూ… అప్పట్లో పార్టీకి, ప్రభుత్వానికి నేనెంత చేశాను? తీవ్ర సంక్షోభం వచ్చినప్పుడు స్పీకర్‌గా ఎంత కీలక పాత్ర పోషించాను? అయినైసరే… గవర్నర్ పోస్ట్‌కు నా పేరును కనీసం పరిగనలోకి తీసుకోలేదా అని సన్నిహితుల దగ్గర వాపోతున్నారట యనమల. టిడిపి కోటాలో మరో గవర్నర్ పదవి ఇప్పటికిప్పుడు వచ్చే అవకాశం లేదు. దీంతో పార్టీకి అంత చేసినా, విశ్వాసంగా ఉన్నా గుర్తించడం లేదన్న అసహనం పెరిగిపోతోందట ఆయనలో. నాకేం తక్కువ, నాకు లేని అర్హత ఏంటని ప్రశ్నిస్తున్నారట రామకృష్ణుడు.. ఎప్పుడైనా పార్టీ గీసిన గీత దాటానా అని కూడా ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. తనకి ఇస్తే… సామాజిక సమీకరణల పరంగా బీసీలకు అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది కదా అంటూ… తెగ ఫీలైపోతున్నట్టు తెలుస్తోంది.
ఆయన తాజా బాధ గురించి జిల్లా రాజకీయ వర్గాల్లో కూడా గట్టి చర్చే జరుగుతోందట.పార్టీ కోసం రామకృష్ణుడు చాలా… చేశారు. దాన్ని ఎవరూ కాదనలేరు. కానీ…. పార్టీ కూడా ఆయనకు మంచి అవకాశాలే ఇచ్చింది కదా? వాటి వల్లే…ఆ స్థాయికి ఎదిగారు కదా? ఆ సంగతి మర్చిపోతే ఎలాగన్న ప్రశ్నలు వస్తున్నాయట. అయినా…. పార్టీ ఆవిర్భావం నుంచి టిడిపిలో రామకృష్ణుడు, ఆయన కుటుంబం అనుభవించినన్ని పదవులు మరొకరికి రాలేదు కదా అని గతాన్ని గుర్తు చేస్తున్నారట కొందరు. ఆయన ఎమ్మెల్సీగా రిటైర్ అయింది కూడా ఈ మధ్యనే. కూతురు దివ్య తుని సిట్టింగ్ ఎమ్మెల్యే. చిన్నల్లుడు ఏలూరు ఎంపీ.వియ్యంకుడు మైదుకూరు ఎమ్మెల్యే.
ఇలా.. ఈ స్థాయిలో ఫ్యామిలీ ప్యాక్ టీడీపీలో ఎవరికైనా ఉందా అన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి పార్టీ వర్గాల్లో. అనుభవించాల్సినవన్నీ అనుభవించేసి….. ఇంకా పార్టీ పదవులు ఇవ్వలేదు, పరిగణనలోకి తీసుకోవడం లేదని సెంటిమెంట్ డైలాగ్స్ కొడితే… మిగతా వాళ్ళకు అవకాశాలు రావద్దా అని ప్రశ్నిస్తున్నారు ఎక్కువ మంది. మొత్తానికి పొలిటికల్ జర్నీ ఎండింగ్ లో గవర్నర్ గా అవకాశమిస్తే గ్రాండ్ ఎగ్జిట్ ఉంటుందని యనమల భావిస్తున్నా….టీడీపీ అధిష్టానం మాత్రం ఆ.. ఒక్కటీ అడక్కు అన్నట్టుగానే ఉందట.
