NTV Telugu Site icon

Yemmiganur: టీడీపీ పార్టీ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్ బీసీలకే కేటాయించాలి: బీసీ ఐక్యవేదిక

Yemmiganur

Yemmiganur

Yemmiganur: బీసీలు అధికంగా ఉండే ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్‌ను తెలుగుదేశం పార్టీ బీసీ వర్గానికి కేటాయించాలని బీసీ ఐక్యవేదిక నిర్వహించిన బీసీ కులాల ఆత్మీయ సమ్మేళనంలో తీర్మానించారు. మాచాని సోమప్ప మెమోరియల్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి 30 కులాల బీసీ నాయకులు భారీ ఎత్తులో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముకలా ఉన్నారని, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 1975 నుండి బీసీ అభ్యర్థి ఎమ్మెల్యేగా పార్టీలు టికెట్లు ఇవ్వలేదని ఇప్పుడైనా తెలుగుదేశం పార్టీ బీసీకి టికెట్ ఇవ్వాలని వివిధ కుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించాలని నాయకులు అభిప్రాయపడ్డారు.

మాచాని సోమప్ప ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ఎనలేని కృషి చేశారని, ఇప్పుడు వారి ముని మనవడు డాక్టర్ మాచాని సోమనాథ్ తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యేగా నిలబడడానికి సిద్ధమవుతున్నారని తెలిపారు. నిలబడడానికి సిద్ధమైన తరుణంలో వారికి తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్‌ను ఇస్తే భారీ మెజార్టీతో గెలిపించుకుని అధిష్టానానికి బహుమతిగా ఇస్తామని, ఈ బాధ్యతను తాము స్వీకరిస్తామని కొందరు బీసీ నేతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు మండలాల నుంచి భారీ ఎత్తున బీసీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంసీ శివకుమార్ అధ్యక్షత వహించారు. వీజీఆర్ కొండయ్య, మల్లికార్జున, డీడీ లింగప్ప, శివదాసు, నరసన్న ,ప్రభాకర్ నాయుడు, ఇతర కుల సంఘ నాయకులు పాల్గొన్నారు.