NTV Telugu Site icon

TDP Parliamentary Party Meeting: నేడు టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశం.. ఇలా చేద్దాం..!

Babu 2

Babu 2

TDP Parliamentary Party Meeting: ఇవాళ టీడీపీపీ సమావేశం జరగనుంది.. ఉండవల్లిలోని తన నివాసంలో.. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలతో భేటీ కానున్నారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు.. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, పెండింగ్ నిధుల ప్రస్తావన పార్లమెంట్‌లో తేవాలని తమ ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు చంద్రబాబు.. ఇప్పటికే రెండు సార్లు చంద్రబాబు జరిపిన ఢిల్లీ పర్యటనల్లో ఇచ్చిన వినతులపై ఫాలో అప్ చేసేలా ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకుంది టీడీపీపీ. ఢిల్లీలో ధర్నాకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సిద్దపడుతోన్నందున్న.. కౌంటర్లను సిద్ధం చేసుకునే అంశంపై టీడీపీ కసరత్తు చేస్తోంది.. జగన్ హయాంలో జరిగిన అరాచకాలను జాతీయ స్థాయిలో ఎండగట్టాలని టీడీపీ భావిస్తోంది..

Read Also:Pakistan: బిన్‌ లాడెన్‌ సన్నిహితుడు అల్‌ఖైదా ఉగ్రవాది అమీనుల్‌ హఖ్‌ అరెస్టు

తాడేపల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ఎంపీలతో భేటీ కానున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు… ఈ నెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో.. అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై కీలక సూచనలు చేయనున్నారు.. ఇక, ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులను కూడా ఆహ్వానించారు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల నుంచి తెచ్చుకోవలసిన నిధులు, వివిధ కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి మరింత ప్రయోజనం పొందేందుకు చేయాల్సిన కృషితో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు వంటి వాటిపై కూడా కీలక సూచనలు చేయనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.