NTV Telugu Site icon

TDP: ఇంకా కొలిక్కిరాని టీడీపీ టికెట్ల పంచాయితీ.. ఆ మూడు పెండింగ్‌లోనే..

Tdp

Tdp

TDP: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ సీట్ల పంచాయతీ ఇంకా తేలడం లేదు. ఫస్ట్ లిస్ట్‌లో 9 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. రెండో జాబితాలో రెండు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. తాజాగా మూడో జాబితా కూడా వచ్చింది. కానీ అనంతపురం, ధర్మవరం, గుంతకల్లు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు. అనంతపురంలో జనసేన పోటీ చేస్తుందని అంతా భావించారు. అయితే.. వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఆ పార్టీకి టికెట్‌ లేదని కన్‌ఫామ్ అయింది. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో పాటు మరికొందరు రేసులో ఉన్నారు. అయినా కూడా అభ్యర్థి ఎవరనే విషయంపై టీడీపీ అధిష్టానం నుంచి స్పష్టత రాలేదు.

అటు గుంతకల్లు నియోజకవర్గంలో మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టమైన హామీతోనే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. ఆలూరు కాకుండా గుంతకల్లు నియోజకవర్గంపై ఆయన కన్నేశారు. బోయ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో ఆయన్ని బరిలో దిగాలని భావించారు. కానీ స్థానిక టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్‌తో పాటు మిగిలిన కీలక నేతలు జయరాంను వ్యతిరేకిస్తున్నారు. తమలో ఎవరికైనా టికెట్ ఇవ్వాలని లోకల్ తమ్ముళ్లు డిమాండ్ చేస్తుండటంతో.. అధిష్టానం ఇంకా నిర్ణయానికి రాలేదు. ఇక ధర్మవరం విషయానికి వస్తే.. పొత్తుల్లో భాగంగా బీజేపీ నేత సూర్యనారాయణకు టికెట్ ఇవ్వాలని దాదాపుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో.. టీడీపీ నేతలు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు.. పార్లమెంట్ నియోజకవర్గాల విషయానికి వస్తే మూడవ జాబితాలో హిందూపురం అభ్యర్థిగా బీకే పార్థసారధిని ప్రకటించారు. మొన్నటి వరకు పెనుకొండ టికెట్ దక్కలేదన్న ఆవేదనలో ఉన్న ఆయన వర్గీయులు కొంతమేర శాంతించారు. అయితే అనంతపురం పార్లమెంట్ స్థానంపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. గుంతకల్లులో బోయ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే.. అనంతపురం పార్లమెంట్ స్థానాన్ని ఓసీలకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అభ్యర్థిగా ఎవరో అధిష్టానం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే.. ఈ మూడు స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన వాయిదా పడే అవకాశముంది. ఒకరిని కాదని మరొకరికి టికెట్ ఇస్తే సహకరించబోమని నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. దీంతో.. అసంతృప్తులను ఎలా బుజ్జగించడమా అని టీడీపీ అధిష్టానం యోచిస్తోంది.