Site icon NTV Telugu

MP Kesineni Nani: వైసీపీలోకి టీడీపీ ఎంపీ..! నేడు సీఎం జగన్‌తో భేటీ..!

Mp Kesineni Nani

Mp Kesineni Nani

MP Kesineni Nani: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలయ రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ఆ పార్టీ నుంచి ఇటు.. ఈ పార్టీ నుంచి అటు జంపింగ్‌లు కొనసాగుతున్నాయి.. టికెట్ల పంపకాలు నేతల్లో చిచ్చు పెడుతుండగా.. మరోపార్టీ నుంచైనా పోటీకి సిద్ధపడుతున్నారు.. ఇక, ఈ మధ్య బెజవాడ రాజకీయాలు కాకరేపుతున్నాయి.. ఎంపీ సీటు తనకు రాదని తేలిపోవడంతో టీడీపీకి సిట్టింగ్‌ ఎంపీ కేశినేని నాని గుడ్‌బై చెప్పేందుకు రెడీ అయ్యాడు.. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించారు.. లోక్‌సభ స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌ కోరా.. మొదట ఎంపీ పదవికి రాజీనామా చేస్తా.. ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేస్తానని వెల్లడించారు. పనిలోపనిగా తన కుమార్తె కేశినేని శ్వేతతో కార్పొరేటర్‌ పదవికి రాజీనామా చేయించారు. అయితే, మరోసారి బెజవాడ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు నాని.. అవసరం అయితే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతాననే సంకేతాలు ఇచ్చారు. కానీ, కేశినేని చూపు ఇప్పుడు వైసీపీపై ఉందని ప్రచారం సాగుతోంది.. ఈ రోజు వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో సమాశేం అయ్యే ఛాన్స్‌ కూడా ఉందని తెలుస్తోంది.

Read Also: Deputy CM Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి గద్దర్ నివాసానికి భట్టి విక్రమార్క

మరోవైపు.. బెజవాడ ఎంపీ సీటును కేశినేని నానికే వైసీపీ ఇస్తుందని ప్రచారం కూడా ఉంది.. ఇప్పటికే నానితో పలుమార్లు వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సమావేశమై చర్చించినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. బెజవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న పలువురు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలతోనూ కేశినేని నానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.. దీంతో, ఆయన వైసీపీలో చేరడానికి పెద్దగా అభ్యంతరాలు కూడా ఉండవని అంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా తనకు వైసీపీ నుంచి ఆఫర్‌ రావడంతో.. కొన్ని షరతులతో పార్టీ కండువా కప్పుకోవడానికి నాని సిద్ధమయ్యారనే ప్రచారం సాగుతోంది.. అందులో ఎంపీ సీటు తనకేగా ఇవ్వాలని.. తనతో పాటు వచ్చే మరికొందరు కీలక నేతలకు ఎమ్మెల్యే సీట్లు కూడా ఇవ్వాలని కేశినేని అడిగారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నానిని కలిసిన వైసీపీ నేతలు.. సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి ఈ విషయాలు తీసుకెళ్లారని.. వాటిపై చర్చించడానికే ఈ రోజు ఎంపీ కేశినేని నాని.. వైఎస్‌ జగన్‌తో సమావేశమయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. కానీ, కేశినేని నానికి బెజవాడ ఎంపీ స్థానాన్ని ఇచ్చేందుకు వైసీపీ సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి సీఎం జగన్‌-కేశినేని నాని భేటీలో ఎలాంటి చర్చ సాగుతోంది అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version