NTV Telugu Site icon

Pemmasani Chandrasekhar: వైసీపీపై పెమ్మసాని ఫైర్.. అది నిజమా? కాదా..?

Pemmasani

Pemmasani

Pemmasani Chandrasekhar: ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు. ‘700 ఎకరాలలో, 150 అడుగులు లోతు తవ్వింది నిజమా కాదా? అని ప్రశ్నిస్తే ఎవరో తవ్వారు అంటున్నారు. జగన్ సీఎంగా, మీరు ఎమ్మెల్యేగా ఉండగా వేరే వాళ్ళని తవ్వనిస్తారా? అవినీతి సొమ్ము తిన్నావు కాబట్టి తప్పించుకోలేక పోటీ చేస్తున్నారు.’ అని వైసీపీ ప్రభుత్వంపై, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిపై డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నిప్పులు చెరిగారు. కొలకలూరు మండలంలోని జాకీర్ హుస్సేన్ నగర్, ఖాజీపేట, కొలకలూరు గ్రామాల్లో జరిగిన ప్రచార కార్యక్రమాల్లో పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ కలిసి గురువారం పర్యటించారు. గ్రామ గ్రామాన ప్రజలను పలకరిస్తూ సాగిన ఆ ప్రచారంలో పలుచోట్ల డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పిస్తూ ముందుకు సాగారు.

ఇక, ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. తనది ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివే బ్లడ్ కాదని, గ్రావెల్ అవినీతిపరుల స్క్రిప్ట్ చదివే బ్లడ్ అని హెచ్చరించారు. రూ. రెండు వేల కోట్ల అవినీతి సొమ్ము ఎవరూ తిన్నారని సూటిగా అడిగిన ప్రశ్నకి వైసీపీ నాయకుల వద్ద సమాధానం లేదని ఎద్దేవా చేశారు. ముందు ముగ్గురు – ఇపుడు మీరు. తన మీద పోటీ చేయడానికి ముందు ముగ్గురు మారారని, రోశయ్య నాలుగో వారని చెప్పారు. గెలుపు ఎవరిదో ఆయనకూ తెలుసని, వెనక్కి వెళ్లిపోదామంటే, తిన్న అవినీతి సొమ్ము ఖర్చు చేయాల్సిందేనన్న ఆ పార్టీ అధినేత హుకుంతో ఆగిపోయారని పేర్కోన్నారు. గ్రావెల్ తవ్వకాల వద్ద తీసిన డ్రోన్ షాట్స్ ప్రపంచానికి పొన్నూరు అవినీతిపరుడి బాగోతాన్ని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాయని తెలిపారు. వైసీపీ అవినీతిని చెప్పుకుంటూ పోవాలంటే ఎన్ని గంటలైనా చాలవని ఈ సందర్భంగా పెమ్మసాని తెలిపారు. అమెరికాలో ఉన్నా, ఆంధ్రాలో ఉన్నా, ఎవరైనా వెళ్ళాల్సింది పైకేనని, అదేదో తన ప్రజల హృదయాలు గెలుచుకుని వెళ్దామనే సొంత ప్రాంతానికి వచ్చానని చెప్పిన పెమ్మసాని వ్యాఖ్యలను జేజే ధ్వానాలతో స్వాగతించారు.

పవన్ మాటలు నిజం చేద్దాం-నాదెండ్ల
వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమన్న పవన్ కల్యాణ్ మాటలను నిజం చేసి చూపించాలని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఓటర్లను కోరారు. రైతులు కోరుకునే ఎత్తిపోతల పథకాన్ని చేపట్ట లేకపోయిన ఈ ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో కనీసం ఒక మోటర్ కూడా బిగించలేకపోయింది అన్నారు. తాము సొంత ఖర్చుతో మోటార్లు ఏర్పాటు చేయిద్దామన్నా అధికారులు అడ్డుపడుతున్నారని తెలిపారు. పర్యటనలో టిడిపి జనసేన బిజెపి నాయకులు విరివిగా పాల్గొన్నారు. ఇక, ప్రచార మార్గంలో డా. పెమ్మసానిని ఖాజీపేట గ్రామస్తులు కలిశారు. స్థానికంగా రోడ్లు నీటి సరఫరా సౌకర్యాలు ఆరోగ్య సంరక్షణ సేవలు ప్రాథమిక అవసరాలు వంటివి తమ గ్రామంలో అందుబాటులో లేవని ఈ సందర్భంగా గ్రామస్తులు పెమ్మసానికి వివరించారు. గ్రామస్తులు సంతకాలు పెట్టి ఇచ్చిన వినతి పత్రాన్ని ఈ సందర్భంగా పెమ్మసానికి అందజేశారు. కాగా చంద్రశేఖర్ మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం రాగానే సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తామని తెలిపారు.