NTV Telugu Site icon

Nara Lokesh: రాష్ట్రం కోసం భూమిని త్యాగం చేసిన రైతులకు న్యాయం జరుగుతుంది: నారా లోకేశ్‌

Nara Lokesh

Nara Lokesh

రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం భూమిని త్యాగం చేసిన రైతులకు న్యాయం జరుగుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులకు ఎదురొడ్డి అమరావతి నిలబడిందన్నారు. అమరావతి కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వారికి ఆయన నివాళులర్పించారు. అమరావతి పరిరక్షణకు రాజధాని రైతులు చేపట్టిన ఉద్యమం గురువారంతో 1500 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నారా లోకేశ్‌ తన ఎక్స్‌ ద్వారా స్పందించారు.

‘కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులకు ఎదురొడ్డి నిలబడింది అమరావతి. ప్రజా రాజధాని కోసం 1500 రోజులుగా నియంతపై పోరాడుతున్న రైతులకు ఉద్యమాభివందనాలు. అమరావతి కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు. వారి ఆశయం త్వరలోనే నేరవేరుతుంది. రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం భూమిని త్యాగం చేసిన రైతులకు న్యాయం జరుగుతుంది. అధర్మంపై ధర్మం విజయం సాధిస్తుంది’ అని నారా లోకేశ్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు.

Also Read: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌!

రాజధాని అమరావతి నిర్మాణానికి 29 గ్రామాల పరిధిలో ఉన్న 34,322 ఎకరాల భూములను 29,881 మంది రైతులు భూసమీకరణ కింద గత టీడీపీ ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే 2019 డిసెంబరు 17న సీఎం జగన్‌ శాసన సభలో చేసిన మూడు రాజధానుల ప్రకటన వారిని కుదిపేసింది. మరుసటి రోజే రాజధాని ఉద్యమం ఊపిరిపోసుకుంది. తుళ్లూరు, మందడం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లో మొదలైన ఉద్యమం.. క్రమంగా అన్ని గ్రామాలను చుట్టేసింది. డిసెంబరు 19న రైతులు బంద్‌ నిర్వహించారు. ఈ ఉద్యమానికి వైసీపీ మినహా మిగిలిన పార్టీలు అన్ని సంఘీభావం ప్రకటించాయి.