Maganti Babu Press Note: ముఖ పరిచయం, రాజకీయ అనుభవం లేని వ్యక్తిని.. చరిత్ర కలిగిన ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎలా నిలబెడతారు? అని ఏలూరు మాజీ ఎంపీ, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు ప్రశ్నించారు. అసలు బీసీ అనే మాటను ఎందుకు ప్రచారంలోకి తీసుకొచ్చారని, ఎవరైనా బీసీలు తమకు ఏలూరు పార్లమెంట్ సీట్ కావాలని అడిగారా? అని మండిపడ్డారు. 4 సీట్లు ఒకే కుటుంబంలో ఇస్తే మిగతా బీసీ కులాలు అంగీకరిస్తారా? అని మాగంటి బాబు పేర్కొన్నారు. ఈసారి ఏలూరు ఎంపీ టికెట్‌ను మాగంటి బాబుకు కాకుండా.. యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్‌కు టీడీపీ అధిష్టానం కట్టబెట్టింది. పుట్టా మహేష్ రాయలసీమ నేత కాగా.. ఆయనకు కోస్తాలో టికెట్ కట్టబెట్టడంతో మాగంటి బాబు అసంతృప్తికి గురయ్యారు.
టికెట్ దక్కని అసంతృప్తిలో ఉన్న మాగంటి బాబు ప్రెస్ నోట్ రాశారు. ‘ముఖ పరిచయం, రాజకీయ అనుభవం లేని వ్యక్తిని చరిత్ర కలిగిన ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎలా నిలబెడతారు?. అసలు బీసీ అనే మాటను ఎందుకు ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఎవరైనా బీసీలు మాకు ఏలూరు పార్లమెంట్ సీట్ కావాలని అడిగారా?. ఇది కేవలం మాకు పొగ పెట్టడం కాదా?. బీసీ వర్గానికి ఇవ్వాలనుకుంటే యనమల కుటుంబం తప్ప మిగిలిన వారు కనబడలేదా?. 4 సీట్లు ఒకే కుటుంబంలో ఇస్తే మిగతా బీసీ కులాలు అంగీకరిస్తారా?. అసలు మాకు మాట మాత్రమైనా చెప్పాల్సిన పనిలేదా?’ అని మాగంటి బాబు ప్రశ్నించారు.
Also Read: Pawan Kalyan: ఆటోలో ప్రయాణించిన పవన్ కళ్యాణ్.. డ్రైవర్‌ల సమస్యలపై ఆరా!
‘అసలు పార్టీకి అయన చేసిన సేవలు ఏంటి?, నేను చేసిన సేవలు ఏంటి? మీకు తెలియవా?.. మొదలైన ప్రశ్నలను అధినేత ముందు వుంచడం జరిగింది. కొంతకాలంగా పార్టీలో నాకు జరిగిన అవమానాలు గుర్తు చేశాను. పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్ట్ వున్న కారణంగా స్థానికుడు అయితే బాగుంటుందని చెప్పాను. మా సీట్ మాకు ఇవ్వాల్సిందే అని మాట్లాడాను. అన్నిటికీ చూద్దాం, చేద్దాం అనే సమాధానం చెప్పారు. చివరిగా సీట్ మార్చడం కుదరదన్నారు. మీకు రాజ్యసభ ఇస్తాం, పబ్లిక్ మీటింగులో ప్రకటిస్తాం అన్నారు. మేము మాత్రం మా కుటుంబం ఎప్పుడూ పరోక్ష ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించలేదు. మేము జనంతో వుండాలి, జనమే మా బలం, లోక్‌సభ ఇవాల్సిందే అని అడిగాము. చర్చలు అక్కడ వాయిదా పడ్డాయి. మరి రెండు రోజుల్లో పూర్తి అవగాహన రావచ్చు, అప్పటివరకు అంతా మంచే జరుగుతుంది అని ఆశిద్దాం. మీ విలువైన సలహాలను సూచనలను తెలియజేయండి’ అని మాగంటి బాబు పేర్కొన్నారు.