Bode Prasad: మాజీ మంత్రి, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథికి పెనమలూరు టికెట్ ఇవ్వకుండా.. ఇంఛార్జ్‌గా మంత్రి జోగి రమేష్‌ని నియమించింది వైసీపీ అధిష్టానం.. ఈ పరిణామాలతో టీడీపీతో టచ్‌లోకి వెళ్లిన పార్థసారథి.. త్వరలోనే సైకిల్ ఎక్కేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే, ఇప్పటికే పెనమలూరు స్థానాన్ని ఆశిస్తున్న టీడీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.. తాజా పరిణామాలపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. టీడీపీలోకి వస్తున్న పార్థసారథి.. పెనమలూరు నుంచి టీడీపీ టికెట్ ఆశించటం అనేది ఆయన ఛాయిస్ అన్నారు. అయితే, టికెట్ పై ఫైనల్ నిర్ణయం తీసుకునేది మా పార్టీ అధినేత చంద్రబాబే అన్నారు. సారథికి అధిష్టానం టికెట్ ఫైనల్ చేసిన తర్వాత మాత్రమే ఆయనకి నేను సహకరించే అంశంపై నిర్ణయం తీసుకుంటానని హాట్ కామెంట్లు చేశారు.
Read Also: Salaar 2: ఊహించిన దానికన్నా ముందుకొచ్చిన ‘శౌర్యాంగ పర్వం’?
అయితే, ఐదేళ్ల నుంచి పార్టీ కోసం పెనమలూరులో కష్ట పడ్డాను అని గుర్తుచేసుకున్నారు బోడే ప్రసాద్.. మాకు న్యాయం చేస్తారని చంద్రబాబుపై పూర్తి నమ్మకం ఉంది.. గత ఐదేళ్ల హయాంలో మా వాళ్లు కూడా ఇబ్బందులు పడ్డ మాట వాస్తవం.. ఐదేళ్ల పాటు కేసులు పెట్టించుకున్న మా కార్యకర్తలు.. ఇప్పుడు వారి నాయకత్వంలో పనిచేయటం ఇష్టం లేకే ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. టీడీపీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం.. చంద్రబాబును టీడీపీని తిట్టిన వారు పుట్ట గతులు లేకుండా పోతారని హెచ్చరించారు. ఇక, పార్థసారథిపై ఇప్పుడే నేనేం మాట్లాడబోను అంటూ దాటవేశారు టీడీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ .