NTV Telugu Site icon

Anam Venkata Ramana Reddy: టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై ఆనం సంచలన ఆరోపణలు

Anam Venkataramana Reddy

Anam Venkataramana Reddy

Anam Venkata Ramana Reddy: తిరుమల తిరుపతి దేవస్థానం అధికారపార్టీ నేతల అవినీతికి అడ్డాగా మారిందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి ఆరోపించారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మన్ అయ్యాక దేవస్థానం డబ్బుల్ని తన కొడుకు అభినవ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. తిరుపతి పరిధిలో ఏ పనికైనా 10శాతం తీసుకుంటున్న భూమన కరుణాకర్ రెడ్డిని ఇప్పటికే 10 శాతం కరుణాకర్ రెడ్డిగా పిలుస్తున్నారన్నారు. టీటీడీ ఉద్యోగులకు కేటాయించిన స్థలాల చుట్టూ అభినవ రెడ్డి 5.45 ఎకరాలు ఎలా కొనుగోలు చేశాడో కరుణాకర్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. తిరుమల శ్రీవారి సొమ్ము తిన్న ప్రతీ రూపాయిని తెలుగుదేశం అధికారంలోకి రాగానే కక్కిస్తామన్నారు.

Also Read: TTD EO Dharma Reddy: ఆనం వెంకటరమణారెడ్డికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి సవాల్..

తాడేపల్లి ప్యాలెస్‌లో సజ్జల ఎలాగో టీటీడీలో ధర్మారెడ్డి వ్యవహారం అలానే ఉందని ఆయన ఆరోపించారు. ధర్మారెడ్డి అవినీతిపై 14 సెక్షన్ల కింద ఢిల్లీలో క్రిమినల్ కేసు నమోదైందని అన్నారు. తనపై ఉన్న క్రిమినల్ కేసుని దాచిపెట్టి ధర్మారెడ్డి టీటీడీ ఈవో అయ్యాడని ఆనం వెంకటరమణారెడ్డి చెప్పారు. అదే అవినీతి టీటీడీలో చేయడని నమ్మకం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఐఏఎస్‌లను కాదని, క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తికి టీటీడీలో కీలక పదవి ఎలా ఇస్తారని ప్రశ్నలు గుప్పించారు. టీటీడీని అడ్డం పెట్టుకుని ఢిల్లీలో ధర్మారెడ్డి లాబీయింగ్ చేస్తున్నాడని ఆరోపించారు. ఢిల్లీలో నమోదైన కేసుపై తీర్పు వచ్చే వరకూ ధర్మారెడ్డిని టీటీడీ బాధ్యతల నుంచి తప్పించాలన్నారు టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి.

Show comments