NTV Telugu Site icon

TDP-Janasena: 28న టీడీపీ-జనసేన భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న చంద్రబాబు, పవన్‌

Tdp Janasena

Tdp Janasena

TDP-Janasena: విజయవాడలో జరిగిన టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు.. ఈ నెల 28వ తేదీన తాడేపల్లి గూడెంలో టీడీపీ – జనసేన కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.. ఇక, తాడేపల్లి గూడెం సభకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌ హాజరుకానున్నారు.. తాడేపల్లి గూడెం సభ వేదికగా కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. సమన్వయ కమిటీ సమావేశంలో రెండు తీర్మానాలకు ఆమోదం లభించింది.. పొత్తును స్వాగతించిన టీడీపీ – జనసేన కేడర్ ను అభినందిస్తూ తీర్మానం. మీడియాపై దాడులను తప్పు పడుతూ సమన్వయ కమిటీ రెండో తీర్మానం చేసింది.

సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. రెండు పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన ఉమ్మడి సభ ఉంటుందన్నారు. తాడేపల్లి గూడెం సమీపంలోని పత్తిపాడు వద్ద ఉమ్మడి సభ నిర్వహిస్తున్నాం.. ఉమ్మడి మేనిఫెస్టోపై తుది కసరత్తు జరుగుతోంది.. త్వరలో విడుదల చేస్తాం అని వెల్లడించారు. ఏయే స్థానాల్లో ఏయే పార్టీలు పోటీ చేయాలనేది చంద్రబాబు-జనసేన అధినేతలే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో టీడీపీ – జనసేన మధ్య గ్యాప్ లేకుండా పని చేయాలి. టీడీపీ – జనసేన మధ్య వైసీపీ తగువులు పెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ప్రజల మధ్యన కూడా జగన్ తగవులు పెడతారు.. జగన్ అంత వరస్ట్ సీఎంను ఇప్పటి వరకు చూడలేదని ఫైర్‌ అయ్యారు. అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి సీఎం జగన్ సైకోలా వ్యవహరిస్తున్నారు అంటూ విరుచుకుపడ్డారు అచ్చెన్నాయుడు..

ఇక, ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదనే ఉద్దేశ్యంతో పొత్తులు పెట్టుకున్నట్టు చెప్పుకొచ్చారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. సమన్వయం లోపం లేకుండా రెండు పార్టీలు ఎన్నికలకు వెళ్లబోతున్నాం. టీడీపీ – జనసేన పార్టీలు కలిసి పని చేయాల్సి ఉంటుందన్నారు. అవసరమైతే త్యాగాలు కూడా చేయక తప్పదని చంద్రబాబు – పవన్ సూచిస్తున్నారు. ఈ నెల 28వ తేదీన జరిగే సభ ఉమ్మడి సభలో రెండు పార్టీల నేతలు పాల్గొంటారని తెలిపారు. బై బై వైసీపీ అనేది ఓ నినాదంగా మారాలి. రెండు నెలల్లో వైసీపీ నుంచి విముక్తి లభించాలన్నారు. యువత, మహిళలు, రైతులకు సంబంధించిన ముఖ్యమైన అంశాలతో కూడిన మేనిఫెస్టో రూపొందిస్తాం. అభ్యర్థుల విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుందన్నారు. రెండు పార్టీల మధ్య ఎలాంటి గ్యాప్ లేదు. జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయని వెల్లడించారు నాదెండ్ల మనోహర్‌.

Show comments