NTV Telugu Site icon

Andhra Pradesh: టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖాయమేనా ?

Ap

Ap

Andhra Pradesh: 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కాంబినేషన్ సక్సెస్ అయింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేశారు. దారుణంగా విఫలమయ్యారు. టీడీపీ 23 స్థానాలకే పరిమితం అయింది. బీజేపీ ఒక్క శాతం ఓట్లే దక్కించుకుని.. ఏపీలో అడ్రస్‌ లేకుండాపోయింది. పవన్ కళ్యాణ్ అనుకున్న స్థాయిలో ప్రభావితం చేయలేకపోయారు. స్వయంగా తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి చెందారు. ఒకే ఒక్క స్థానంతో జనసేన సరిపెట్టుకుంది. 2019 ఎన్నికల తర్వాత బీజేపీ-జనసేన తిరిగి ఏకమయ్యాయి. టీడీపీ కూడా బీజేపీతో గ్యాప్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. ఆ కాంబినేషన్ మళ్లీ వర్కవుట్ అవుతుందా..? అనే చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ మధ్య ఉన్న కొద్దిపాటి సమస్యలు పరిష్కారం అవుతాయని.. కలిసే ఎన్నికలకు వెళ్తామని ధీమాను వ్యక్తం చేశారు పవన్.

పవన్ కల్యాణ్‌ కామెంట్లపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికిప్పుడే కాకున్నా.. భవిష్యత్తులోనైనా టీడీపీ-బీజేపీ కలవనున్నాయా..? అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. బహిరంగంగా చెప్పకున్నా.. టీడీపీ-బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు నిర్ణయం తీసేసుకున్నాయనేలా.. పవన్‌ కల్యాణ్‌ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. టీడీపీ-బీజేపీ పార్టీలను తిరిగి ఒకే తాటి మీదకు తెచ్చేందుకు పవన్ మధ్యవర్తిత్వం వహించారు. దీన్ని జనసేనాని కూడా బహిరంగంగానే అంగీకరించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తాను పని చేస్తున్నానని అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చూసుకునే క్రమంలోనే బీజేపీ పెద్దలను కలుస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆ తర్వాత మళ్లీ అదే తరహా వ్యాఖ్యలు చేశారు పవన్. పవన్ రాయబారాలు నడిపిన తర్వాతే… అమిత్‌ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు సమావేశం జరిగింది. ఆ సమావేశం తర్వాతనే అమిత్ షా-నడ్డాలు ఏపీకి వచ్చి జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇదే విషయాన్ని కొందరు నేతలు గుర్తు చేస్తున్నారు.

బీజేపీ ఏపీ నేతల్లో కూడా స్పష్టమైన మార్పు కన్పిస్తోంది. నాయకత్వ మార్పు తర్వాత పొత్తుల అంశం, చంద్రబాబు మీద విమర్శలు తగ్గిపోయాయి. సోము వీర్రాజు సహా.. ఇంకొందరు నేతలు.. వైసీపీ కంటే ఎక్కువగా చంద్రబాబును విమర్శించేవారు. ఇప్పుడా పరిస్థితి కన్పించడం లేదు. ప్రస్తుత ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి టార్గెట్ జగన్.. టార్గెట్ ఏపీ ప్రభుత్వం.. అన్నట్టుగానే విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబును పురంధేశ్వరి ఎక్కడా విమర్శించడం లేదు. పొత్తులపై పార్టీ అధిష్ఠానం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందన్న ఆమె.. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో పొత్తుల వ్యవహారాన్ని జాతీయ నాయకత్వం చూసుకుంటుందని స్పష్టం చేశారు.

మరోవైపు.. పవన్‌ కళ్యాణ్‌ NDAతో కలవడం బాధాకరమన్నారు సీపీఐ జాతీయ నేత నారాయణ. బీజేపీతో పవన్‌ కలవడం.. లౌకికవాదానికి ప్రమాదకరమన్న ఆయన.. బీజేపీ, టీడీపీల మధ్య మధ్యవర్తిత్వం చేయడం మంచిది కాదన్నారు. బీజేపీ, టీడీపీ కలిస్తే.. ఏపీలో వైసీపీ గెలవడం ఖాయమని నారాయణ జోస్యం చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లౌకిలవాదులమనే చెప్పుకునే టీడీపీ.. బీజేపీతో పొత్తుపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ-జనసేన ఎలాగూ పొత్తులోనే ఉన్నారు కాబట్టి.. ఇబ్బంది లేదు. ఇక టీడీపీ బీజేపీతో పొత్తులోకి వస్తుందనే అంశాన్ని ప్రకటించడానికి ఇంకొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. మిగిలిన వారికంటే పవన్‌కు.. ఈ క్లారిటీ ఉండడంతో 2014 కాంబినేషన్ రిపీట్‌ అవుతుందనే కామెంట్లు చేస్తున్నారు.