NTV Telugu Site icon

Bode Prasad: నా బలం పెనమలూరు ప్రజలే.. డబ్బుతో నా వెంట్రుక కూడా కొనలేరు..!

Bode Prasad

Bode Prasad

Bode Prasad: నా బలం, బలగం పెనమలూరు నియోజకవర్గ ప్రజలు, టీడీపీ కార్యకర్తలే అన్నారు టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్.. ఎవరికి కష్టం వచ్చినా ఆదుకోవడానికి ముందుకు వస్తానని తెలిపారు. పెనమలూరు నియోజకవర్గంలో నిర్వహించిన టీడీపీ జయహో బీసీ సభలో ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.. గుంటూరు మార్కెట్‌ యార్డ్‌ గోడౌన్‌లోకి వెళ్లి చూస్తే.. బీసీలకు కేటాయించాల్సిన పనిముట్లు తుప్పుపట్టిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి ప్రజలకు అందకూడదన్న ఉద్దేశంతోనే.. సీఎం వైఎస్‌ జగన్‌ సైకో మారి.. ఈ విధంగా బీసీలకు పనిముట్లు అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు.

Read Also: Interfaith Relationship: ముస్లిం వ్యక్తితో లవ్ ఎఫైర్.. చెల్లిని చంపేసిన అన్న..

ఏ కష్టం వచ్చినా.. ప్రజలకు, టీడీపీ శ్రేణులకు అండగా ఉంటూ కాపాడుకుంటూ వస్తున్నా అన్నారు బోడే ప్రసాద్.. రోజుకు ఒకరు కొత్త వ్యక్తులు వస్తూనే ఉంటారు.. కానీ, ప్రజలకు అందుబాటులో ఉన్న నేతల గురించి ఆలోచించాలన్నారు. మరో నియోజకవర్గంలో ఉన్న గంజాయి మొక్కను.. పెనమలూరుకు తీసుకొస్తే.. తులసి మొక్క అవుతుందా? అంటూ మంత్రి జోగి రమేష్‌పై విరుచుకుపడ్డారు. ఇక, టీడీపీ అభ్యర్థిని మారుస్తారట.. బోడె ప్రసాద్‌ డబ్బులకు అమ్ముడు పోయాడట అని కొందరు నాకు ఫోన్‌ చేస్తున్నారు.. నేను ఒకటే చెబుతున్నా.. నేను డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదు.. డబ్బుతో నా వెంట్రుకను కూడా కొనలేరని స్పష్టం చేశారు. రాజీపడే ప్రసక్తే లేదు.. కార్యకర్తలకు అప్పుడు, ఇప్పుడు.. ఎప్పుడే అండగా ఉంటానని పేర్కొన్నారు. ఇక, టీడీపీ నేతలను వైసీపీ సర్కార్‌ వేధింపులకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఓ కేసులో ఉన్న వ్యక్తి.. టీడీపీ నేతకు ఫోన్‌ చేసినా.. అరెస్ట్‌ చేసి వేధిస్తారు.. సోషల్‌ మీడియాలో పోస్టును షేర్‌ చేసినా.. అరెస్ట్‌ చేసి క్షోభకు గురిచేస్తున్నారు అంటూ వైఎస్‌ జగన్‌ సర్కార్‌పై ధ్వజమెత్తారు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్.