Kesineni Swetha: ముందు విజయవాడ మేయర్‌ని కలిసి కార్పొరేట్ పదవికి రాజీనామా చేస్తాను.. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు బెజవాడ ఎంపీ కేశినేని నాని కూతురు, టీడీపీ కార్పొరేటర్ కేశినేని శ్వేత.. టీడీపీని వీడాలని నిర్ణయం తీసుకున్న తర్వాత సోషల్ మీడియా వేదికగా రోజుకో అప్‌డేట్ ఇస్తున్న ఎంపీ కేశినేని నాని.. ఈ రోజు తన కూతురు రాజీనామా వ్యవహారాన్ని బహిర్గతం చేశారు.. ఇక, దాని అనుగుణంగానే శ్వేత అడుగులు పడుతున్నాయి.. ఈ రోజు ఉదయం విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తో భేటీ అయ్యారు కేశినేని శ్వేత.. విజయవాడ 11 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ గా ఉన్న శ్వేత.. రాజీనామా చేసేందుకు సిద్ధమైన వేళ.. గద్దెను కలిసి.. తన రాజీనామా వ్యవహారాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఇక, గద్దె రామ్మోహన్‌తో భేటీ తర్వాత కేశినేని శ్వేత మాట్లాడుతూ.. నాకు గద్దె రామ్మోహన్ ఆత్మీయులు.. నాకు ఆయన చాలా సహకరించారని తెలిపారు.. కలిసి ఒక మాట చెప్పాలని వచ్చాను అన్నారు. ఇక, ముందుగా మేయర్ ను కలిసి కార్పొరేటర్ పదవికి రాజీనామా అందజేస్తా.. ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేస్తాను అని ప్రకటించారు. అయితే, గద్దె రామ్మోహన్ తో మా నాన్న విషయం చర్చకు రాలేదని స్పష్టం చేశారు.. మరోవైపు.. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. శ్వేత నన్ను కలిసి మాట్లాడారు.. జాగ్రత్తగా చూసి చేసుకోమని చెప్పాను అన్నారు. రాజీనామా ఎందుకు..? ఏమిటి..? అనే కారణాలు చర్చించలేదని స్పష్టం చేశారు. అంతేకాదు.. ఎంపీ కేశినేని నాని రాజీనామా అంశం నాకు చెప్పలేదన్నారు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ .
కాగా, ఇప్పటికే తాను ఎంపీ పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేయనున్నట్టు బెజవాడ ఎంపీ కేశినేని నాని ప్రకటించారు.. విజయవాడ 11 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ గా ఉన్న శ్వేత.. కాసేపట్లో తన పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేస్తారు.. ఎంపీ కేశినేని నాని వ్యవహారంలో ముందుగా ఆయన కుమార్తె శ్వేత రాజీనామా చేస్తున్నారు.. ఇక, గత మున్సిపల్ ఎన్నికల్లో శ్వేతకు మేయర్ పదవి విషయంలో కేశినేని నాని అసంతృప్తి మొదలైందని చెబుతుంటారు.. బెజవాడలో టీడీపీ గెలిస్తే శ్వేత కు మేయర్ పదవి ఇవ్వాలని ఎంపీ కేశినేని నాని పట్టుబట్టగా.. శ్వేత కు మేయర్ పదవి ఇవ్వొద్దని మరో వర్గం వ్యతిరేకించింది.. ఆ తర్వాత కేశినేని టీడీపీకి దూరమయ్యారనే వార్తలు వచ్చినా.. పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. కాస్త యాక్టివ్‌గానే పనిచేశారు.. ఆ తర్వాత కేశినేని బ్రదర్స్ వ్యవహారంలో టీడీపీ అధిష్టానం చేసిన సూచనలతో.. రాజీనామాకు కేశినేని నాని సిద్ధమవుతోన్న విషయం విదితమే.