NTV Telugu Site icon

MLC Nagababu: గొల్లప్రోలులో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన.. టీడీపీ-జనసేన కార్యకర్తల పోటాపోటీ నినాదాలు!

Mlc Nagababu

Mlc Nagababu

ఎమ్మెల్సీ నాగబాబు కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో పర్యటిస్తున్నారు. గొల్లప్రోలు మండలంలో అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అన్న క్యాంటీన్‌ను నాగబాబు ప్రారంభించారు. అన్న క్యాంటీన్ ప్రారంభం సందర్భంగా టీడీపీ-జనసేన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. అన్న క్యాంటీన్‌ను నాగబాబు ఓపెన్ చేస్తుండగా.. జై వర్మ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. జై జనసేన అంటూ జనసైనికులు కౌంటర్ నినాదాలు చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఎమ్మెల్సీ నాగబాబు పాల్గొన్నారు. అయితే అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం దగ్గర టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఆయన ఫోటో లేదు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు జై వర్మ అని నినాదాలు చేస్తుంటే.. కౌంటర్‌గా జనసేన కార్యకర్తలు జై జనసేన అంటూ నినాదాలు చేశారు. ఎవరి పార్టీ జెండాలతో ఆ పార్టీ కార్యకర్తలు హడావుడి సృష్టించారు. నాగబాబు ప్రారంభోత్సవాల కార్యక్రమానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ దూరంగా ఉన్నారు. తనకు ఆహ్వానం అందినప్పటికీ వేరే కార్యక్రమాలు ఉండటం వల్ల అక్కడికి వెళ్లడం లేదని ఆయన అంటున్నారు.

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలి కార్యక్రమం కావడంతో పిఠాపురం జనసైనికులు నాగబాబుకు ఘన స్వాగతం పలికారు. ప్రారంభోత్సవాలు ముగిసిన తర్వాత నాగబాబు కారు ఎక్కుతుండగా.. జై వర్మ, వర్మ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ నాగబాబు ఇవేమీ పట్టించుకోకుండా వెళ్లిపోయారు.