Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..

Pachimirchi Avakaya

Pachimirchi Avakaya

Pachimirchi Avakaya: ఆవకాయ అంటే చాలామందికి మామిడి ఆవకాయే గుర్తుకు వస్తుంది. కానీ పచ్చిమిర్చితో చేసే ఆవకాయ కూడా అద్భుతమైన రుచిని ఇస్తుంది. బజ్జీ మిరపకాయలతో చేసే ఈ పచ్చిమిర్చి ఆవకాయ కారం ఎక్కువగా ఉంటుందనుకుంటే పొరపాటే. సరైన విధంగా చేస్తే మిరపకాయలు అస్సలు కారం లేకుండా కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి. వేడి వేడి అన్నంలో ఒక మిరపకాయ, కొంచెం ఆవకాయ గుజ్జు వేసుకుని తింటే నెయ్యి కూడా అవసరం ఉండదు. ముఖ్యంగా ఈ పచ్చడిని సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా చెసాలో చూసేద్దామా..

కావలసిన పదార్థాలు:
* బజ్జీ మిరపకాయలు – పావు కిలో
* నిమ్మకాయలు – 3
* మెంతులు – 1 టేబుల్ స్పూన్
* ఆవాలు – 2 టేబుల్ స్పూన్లు
* కారం – అర కప్పు
* ఉప్పు – పావు కప్పు (తగ్గించి లేదా పెంచుకోవచ్చు)
* వెల్లుల్లి రెబ్బలు – 30 నుంచి 40
* పల్లీ నూనె – 1 కప్పు

×
×
Ad

తయారీ విధానం:
మిరపకాయలను సిద్ధం చేసుకోవడం:
ముందుగా ఫ్రెష్‌గా గట్టిగా ఉన్న బజ్జీ మిరపకాయలను ఎంపిక చేసుకోవాలి. పగుళ్లు ఉన్న కాయలను తీసుకోకూడదు. వాటిని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి అరగంట పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. తర్వాత ప్రతి మిరపకాయను మధ్యలో కోసి గింజలను నిదానంగా తీసేయాలి. ఇలా చేయడం వల్ల పచ్చడి కారం తగ్గి తినడానికి చాలా బాగుంటుంది.

నిమ్మరసం కలపడం:
గింజలు తీసిన మిరపకాయలపై నిమ్మరసం వేసి బాగా కలిపి 15 నిమిషాలు నాననివ్వాలి. నిమ్మరసం కలపడం వల్ల మిరపకాయలలో ఉన్న కారం తగ్గుతుంది. అలాగే ఇది సహజమైన ప్రిజర్వేటివ్‌లా పనిచేసి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు సహాయపడుతుంది.

ఆవాల పొడి తయారీ:
స్టవ్‌పై పాన్ పెట్టి ముందుగా మెంతులను సన్నని మంటలో ఎర్రగా వేయించాలి. తర్వాత అందులో ఆవాలు వేసి ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడే పచ్చడికి అసలైన రుచిని ఇస్తుంది.

పచ్చడి కలిపే విధానం:
ఒక పెద్ద బౌల్‌లో కారం, ఉప్పు, ఆవాల-మెంతుల పొడి, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత బుడ్డల (పల్లీ) నూనె పోసి బాగా కలపాలి. ఈ పచ్చడికి పచ్చి పల్లీ నూనె వాడితేనే మంచి రుచి వస్తుంది. ఇప్పుడు నిమ్మరసంలో నానబెట్టిన మిరపకాయలను ఇందులో వేసి చేత్తోనే నిదానంగా కలపాలి. ప్రతి మిరపకాయకు కారం మిశ్రమం బాగా పట్టేలా చూసుకోవాలి.

పచ్చడి ఊరడం:
పచ్చడిని కలిపిన తర్వాత మూతపెట్టి ఒక రోజు పాటు ఊరనివ్వాలి. మరుసటి రోజు నూనె పైకి తేలుతుంది. అప్పుడు మరోసారి నిదానంగా కలిపి ఉప్పు లేదా పులుపు తక్కువగా ఉంటే అవసరానికి తగ్గట్టు కలుపుకోవచ్చు. మళ్లీ ఇంకో రోజు ఊరనిచ్చి గ్లాస్ జాడీల్లో నిల్వ చేసుకోవాలి. పచ్చడిపై నూనె పొర కనిపించేలా ఉండాలి. పచ్చడి తీసే స్పూన్ తడి లేకుండా చూసుకుంటే బయటే రెండు నుంచి మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిజ్‌లో ఉంచితే ఆరు నెలలకుపైగా తాజాగా ఉంటుంది. అంతే ‘పచ్చిమిర్చి ఆవకాయ’ రెడీ.