9 dead in Train Fire near Madurai Railway Station: తమిళనాడులోని మధురైలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం లక్నో నుంచి రామేశ్వరం వెళ్తున్న రైలు టూరిస్ట్ కోచ్‌లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రైలు బోగీ పూర్తిగా కాలిపోగా.. 9 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
వివరాల ప్రకారం.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) టూరిస్ట్ రైలు లక్నో నుంచి రామేశ్వరం వెళ్తోంది. ఈ రైలులో 63 మంది యాత్రికులు ఉన్నట్లు సమాచారం. ఈ టూరిస్ట్ రైలు తమిళనాడులోని మధురైకి శనివారం ఉదయం 5.15 గంటలకు చేరుకుంది. మధురై రైల్వే స్టేషన్ సమీపంకు రాగానే ప్రైవేటు పార్టీ కోచ్‌లో (కిచెన్ బోగీ) సిలిండర్ పేలింది. దాంతో ట్రైన్‌లో మంటలు చెలరేగాయి. గాలుల కారణంగా మంటలు మరింత ఉదృతమయ్యాయి. దాంతో ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని కేకలు వేశారు. కొంతమంది అప్రమత్తమై కిందకు దిగారు.
Also Read: Asia Cup 2023: ఆసియా కప్ 2023 ముందు ఊహించని షాక్.. కరోనా వైరస్ బారిన పడిన ఇద్దరు స్టార్ ప్లేయర్స్?
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు అంటున్నారు. టీ చేసుకునే ప్రయత్నంలో సిలిండర్ పేలి ప్రమాదం జరిగినట్లు సమాచారం తెలుస్తోంది. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.