Heavy Rain Hits Tamil Nadu: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం తమిళనాడులోని దక్షిణ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి మరియు కన్యాకుమారి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భారీ వర్షానికి రహదారులన్నీ జలమయంగా మారడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు మరియు బ్యాంకులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రైవేటు రంగ సంస్థల కార్యకలాపాలు నిలిచిపోయాయి. మరోవైపు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తూత్తుకుడి జిల్లాలోని తిరుచెందూర్, సత్తాంకుళం స్టేషన్లలో గడిచిన 24 గంటల్లో 606 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. తిరునల్వేలిలోని పాలయంకోట్టై స్టేషన్‌లో 260 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. రాబోయే ఏడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతాయని హెచ్చరిక జారీ చేసింది. మధురై, విరుదునగర్, తేని జిల్లాల్లోని కొన్ని చోట్ల ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. తూత్తుకుడి, దిండిగల్, కోయంబత్తూర్ మరియు తిరుప్పూర్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Also Read: Joe Biden Car Crash: భద్రతా వైఫల్యం.. జో బైడెన్ కాన్వాయ్‌ను ఢీకొన్న కారు!
వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాపనాశం, పెరుంజని, పెచుపారై డ్యాముల నుంచి నీటిని వదలడంతో.. తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా వరద చేరింది. ఈ వరదలకు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునిగాయి. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడానికి సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం భారీ స్థాయిలో ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసు బలగాలను తమిళనాడులో మోహరించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఈ నెల ప్రారంభంలో మిగ్‌జాం తుపాను ప్రభావంతో తమిళనాడు అతలాకుతలమైంది. దాని నుంచి కోలుకుంటున్న సమయంలో మళ్లీ భారీ వర్షాలు తమిళనాడును ముంచెత్తుతున్నాయి.