నవతరం భామల్లో తమన్నా తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు. ఆమె పేరు వింటే చాలు కుర్రకారులో తమకాలు చెలరేగుతాయి. తపస్సు చేసుకొనేవారిలో సైతం తపనలు రేపే అందం తమన్నా సొంతం. అందంతో బంధాలు వేస్తున్నారామె. తమన్నాను చూడగానే చాలామందికి పాలరాతి బొమ్మకు ప్రాణం వచ్చిందే అనిపిస్తుంది. నిజమే! ఈ ‘మిల్కీ బ్యూటీ’ని చూస్తే ఆ భావన కలుగక మానదు.
ఇంతలా అలరిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా 1989 డిసెంబర్ 21న ముంబైలో జన్మించారు. మనెక్జీ కూపర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్కూల్ లో చదివిన తమన్నాచిన్నతనం నుంచీ ‘షో బిజ్’పై మనసు పారేసుకుంది. అందుకు ఆమె కన్నవారు సంతోష్ భాటియా, రజనీ సైతం సహకరించారు. తమన్నా చదివే పాఠశాల వార్షికోత్సవంలో ఆమె చేసిన ప్రోగ్రామ్ అందరినీ అలరించింది. ముంబై సినిమా జనాల్లో కొందరు తమన్నాకు తమ చిత్రాల్లో అవకాశాలూ ఇస్తామన్నారు. అప్పుడు తమన్నా వయసు కేవలం 13 సంవత్సరాలే! అనుభవం కోసం ముంబై లోని పృథ్వీ థియేటర్ లో ఏడాది పాటు నాటకాల్లో నటించింది. తరువాత కొన్ని ఆల్బమ్స్ లోనూ తళుక్కుమంది. పదిహేనేళ్ళ వయసులో ‘చాంద్ స రోషన్ చెహ్రా’ సినిమాతో తమన్నా నాయికగా పరిచయం అయ్యారు. ఆ పై మంచు మనోజ్ హీరోగా రూపొందిన ‘శ్రీ’ చిత్రంతో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టారామె. తరువాత ‘కేడీ’ అనే తమిళ సినిమాలో నటించారు. ఇలా ఆరంభంలోనే వరుసగా హిందీ, తెలుగు, తమిళ చిత్రాలలో నటించిన తమన్నాకు ఆ పై ఆ సినిమా రంగాల్లో అవకాశాలు రావడం మొదలెట్టాయి. అయితే శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘హ్యాపీ డేస్’తోనే తమన్నా నటజీవితంలో హ్యాపీ డేస్ మొదలయ్యాయని చెప్పాలి. అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ మధ్య మధ్యలో అవకాశం లభిస్తే హిందీలోనూ నటిస్తూ తమన్నా సక్సెస్ చవిచూశారు.
తెలుగులో తమన్నా నటించిన “హండ్రెడ్ పర్సెంట్ లవ్, బద్రినాథ్, ఊసరవెల్లి, రచ్చ, కెమెరామెన్ గంగతో రాంబాబు, ఆగడు, బాహుబలి (సిరీస్)” చిత్రాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. కొన్ని చిత్రాలలో అతిథి పాత్రల్లోనూ మురిపించిన తమన్నా, మరికొన్ని సినిమాల్లో ఐటమ్ గాళ్ గానూ ఊరించింది. ‘అల్లుడు శీను’లోని “లబ్బరు బొమ్మ…”, ‘స్పీడున్నోడు’లో “బ్యాచ్ లర్ బాబూ…”, ‘జాగ్వార్’లో “మందార తైలం…”, ‘జై లవకుశ’లో “స్వింగ్ జరా…”, ‘సరిలేరు నీకెవ్వరు’లో “డాంగ్ డాంగ్…” పాటల్లో తమన్నా అందచందాలు కుర్రకారుకు విడదీయరాని బంధాలు వేశాయి. వెంకటేశ్ జోడీగా ‘ఎఫ్-2, ఎఫ్-3’ చిత్రాల్లో తమన్నా కామెడీ సైతం భలేగా పండించారు. చిరంజీవి ‘సైరా…నరసింహారెడ్డి’లో లక్ష్మి పాత్రలోనూ ఎంతగానో మురిపించారామె. రాబోయే చిరంజీవి ‘భోళాశంకర్’లోనూ తమన్నా కీలక పాత్ర ధరిస్తున్నారు. దీంతో పాటు హిందీలో ‘బోలె చుడియా’లోనూ, మళయాళ చిత్రం ‘బంద్రా’లోనూ తమన్నా నటిస్తున్నారు. రాబోయే చిత్రాలలోనూ తమన్నా అందం రసికులకు బంధాలు వేయకమానదని చెప్పవచ్చు. తమన్నా మరిన్ని పుట్టినరోజులు మహదానందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.